లక్షణాలు లేని వారి కంటే ఉన్నవారు నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అలాగే కొవిడ్ బాధితులతో నివాసం పంచుకునే వారు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడం చాలా ముఖ్యమని.. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని సూచించింది.
వివిధ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి తీరుపై లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేశారు. కార్యాలయాలు, ఇతర పనిప్రదేశాలు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇంట్లోనే వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అధ్యయనం పేర్కొంది. కరోనా బాధితుడితో వరుసగా ఐదు రోజులు ఇల్లు పంచుకునే కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 45 కాంటాక్ట్ ట్రేసింగ్ అధ్యయనాలపై స్టాటిస్టికల్ రివ్యూ జరపడం ద్వారా ఈ ఫలితాల్ని వెల్లడించారు.
వ్యాప్తిని అరికట్టడంలో లక్షణాలు లేనివారే సవాల్‌గా మారారని అధ్యయనం పేర్కొంది. లక్షణాలు లేకపోవడం వల్లే కాంటాక్ట్ ట్రేసింగ్ లో అసలు ఎవరు వైరస్ వ్యాప్తి చేస్తున్నారో తెలియడం లేదని స్పష్టం చేసింది. ఇక వ్యాప్తికి.. వయసుకి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. వివిధ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి తీరు ఎలా ఉందో అర్థం చేసుకునేందుకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ హేలే థామ్సన్ అభిప్రాయపడ్డారు. తద్వారా వ్యాప్తిని అరికట్టేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు మార్గదర్శకాలు రూపొందించొచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: 'ఆరోగ్య సేవలకు ఆటంకం లేకుండా కొవిడ్ టీకా పంపిణీ'