కరోనా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే అందుబాటులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టీకా.. వైరస్ను మొత్తాన్ని అంతం చేసే అతీత శక్తి కాదని తెలిపారు. దాదాపు ఏడాదిగా పంజా విసురుతున్న మహమ్మరి.. ప్రపంచంలో ఏదో ఒక మూల ఉన్నంత వరకూ ఎంతటి వారైనా, ఎక్కడివారైనా ప్రమాదంలో ఉన్నట్లేనని స్పష్టం చేశారు. అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలని సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పశ్చిమ పసిఫిక్ ప్రాంత డైరెక్టర్ టకేషి కాసాయి ఓ మీడియా సమావేశంలో బుధవారం ఈ వ్యాఖ్యలు చేసినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జినువా తెెలిపింది.
వ్యాక్సిన్ త్వరగా అందడం కష్టమే..
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రావడం కష్టమే అని టకేషి చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే, దానిని ఉత్పత్తి చేసి అందరికీ సరఫరా చేయడం మరో ఎత్తు అని స్పష్టం చేశారు. అందుకే మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇంకొంత కాలం సిద్ధంగా ఉండాలన్నారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన కొవ్యాక్స్ ద్వారా పశ్చిమ పసిఫిక్ ప్రాంతం దేశాల్లో 2021 రెండో త్రైమాసికం నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని టకేషి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఒబామా పుస్తకం రికార్డ్- నెల రోజుల్లోనే 33లక్షల అమ్మకాలు