కొవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న భారత్‌కు సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఈయూ ముందుకొచ్చాయి. కొవిషీల్డ్ టీకా ముడిపదార్థాలు తక్షణమే భారత్‌కు పంపాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోబాల్‌కు యూఎస్ ఎన్‌ఎస్‌ఏ సమాచారం అందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈకిట్‌లు పంపేందుకు సిద్ధమైంది. ఆక్సిజన్ ఉత్పత్తి, సంబంధిత సామగ్రి పంపేందుకు అత్యవసర ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు మరో దేశం ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ప్రాణవాయువు అందేలా తగిన సాయం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.
దాయాది సాయం
భారత్‌కు సాయం కొనసాగుతుందని పొరుగుదేశం చైనా ఇప్పటికే ప్రకటించగా.. దాయాది పాకిస్థాన్ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇంగ్లాండ్ కూడా భారత్‌కు సాయం ప్రకటించింది. 600కుపైగా ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు పంపుతున్నట్లు వెల్లడించింది. ఇంగ్లాండ్ నుంచి ఆక్సిజన్ పరికరాలు మంగళవారం దిల్లీ చేరుకోనున్నాయి. ఈ మేరకు ఇంగ్లండ్ విదేశాంగశాఖ వెల్లడించింది.
మెడికల్ ఆక్సిజన్ పంపిణీ
ఇంగ్లండ్‌తోపాటు యూరోపియన్ యూనియన్, జర్మనీ కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అత్యసవర సమయాల్లో వినియోగించే మెడికల్ ఆక్సిజన్, వివిధ రకాల మందులను పంపిణీ చేసేందుకు ఈయూ సిద్ధమైంది. ఈ మేరకు యూరోపియన్ కమిషనర్ ఫర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ జనేజ్ లెనర్సిక్ ట్విటర్‌లో వెల్లడించారు.
జర్మనీ హస్తం..
మరోవైపు భారత్‌కు సాయం చేసేందుకు ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేస్తున్నట్లు జన్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ భారత ప్రజలందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేయాలనుంది. కరోనా రెండోదశ వ్యాప్తి ఇంత భయంకరంగా ఉండటం నిజంగా దురదృష్టం.. అంటూ తన అధికార ప్రతినిధి స్టెఫెన్ సైబర్ట్ చేసిన ట్వీట్‌ను ఆమె షేర్ చేశారు.
ఇజ్రాయెల్ సైతం
అయితే జర్మనీ ఏరకంగా సాయం చేస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌లో ఆక్సిజన్ కొరత ఎంత మేర ఉందన్న వివరాలు, ఆక్సిజన్ ఎలా సరఫరా చేయాలన్న వివరాలను జర్మనీ ఆర్మీ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ ఇజ్రాయిల్ కూడా భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొస్తోందని సమాచారం.
ఇదీ చదవండి : 'అలా చేస్తే 5% లోపే పాజిటివిటీ రేటు'