కరోనా వైరస్‌తో మానవ పేగుల్లోనూ ఇన్‌ఫెక్షన్ కలుగుతుందని నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. పేగుల్లోని కణాల్లో ఈ వైరస్ వృద్ధి చెందుతుందని గుర్తించారు. కొవిడ్-19 రోగుల్లో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ రుగ్మతలు తలెత్తడానికి కారణమిదేనని వారు పేర్కొన్నారు.
కొవిడ్-19 రోగుల్లో తుమ్ములు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి రుగ్మతలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే మూడో వంతు రోగులకు కడుపులో వికారం, డయేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రోగుల మలంలోనూ వైరస్ నమూనాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాస, జీర్ణాశయ అవయవాల తీరుతెన్నులు వేరైనప్పటికీ కొన్ని సారూప్యతలూ ఉన్నాయని తాజా పరిశోధనలో కనుగొన్నారు.
కరోనా వైరస్ ప్రవేశానికి వీలు కల్పించే ఏసీఈ2 రెసెప్టర్లు.. పేగుల్లోని కణాల్లో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. వీటికి కరోనా వైరస్ సోకుతోందని, రోజులు గడిచేకొద్దీ వైరస్ సంఖ్య పెరుగుతోందని గుర్తించారు. ఏసీఈ2 రెసెప్టార్ల స్థాయి ఎక్కువగా ఉన్న కణాలతో పాటు తక్కువగా ఉన్నవాటిపైనా వైరస్ దాడి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణకు మలం నమూనాలనూ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.