Manu Bhaker Khel Ratna Award : ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మనూ బాకర్‌కు ఖేల్‌రత్న అవార్డ్స్ నామినేషన్ల లిస్ట్‌లో చోటు దక్కలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అంశం కాంట్రవర్సీ అయ్యింది. దీనిపై ఇప్పటికే మనూ తండ్రి రామ్‌కిషన్ బాకర్, ఆమె కోచ్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై మనూ స్వయంగా స్పందించింది. ఒక అథ్లెట్‌గా దేశం కోసం ఆడటం తన బాధ్యత అని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
'ఓ అథ్లెట్‌గా దేశం కోసం ఆడటం మాత్రమే నా కర్తవ్యం. గుర్తింపు, అవార్డులు నాకు స్ఫూర్తినిస్తాయి. కానీ, అవే నా లక్ష్యాలు కాదు. నామినేషన్ ప్రక్రియలో ఏదో లోపం జరిగి ఉండొచ్చు. అది పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. అవార్డ్స్‌తో సంబంధం లేకుండా, నేను దేశానికి మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్నా' అని మను బాకర్ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలో 12 మందితో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అవార్డుల కోసం స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అథ్లెట్లకు మంత్రిత్వ శాఖ కల్పించింది. అయితే ఈ జాబితాలో మను బాకర్‌కు చోటుదక్కకపోవడం వల్ల వివాదం మొదలైంది.
కాగా, ఈ పురస్కారానికి ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదని, అందులో ఆమె పేరు ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. 'ఇంకా తుది జాబితా సిద్ధం కాలేదు. వచ్చిన ప్రతిపాదనలపై ఒకట్రెండు రోజుల్లో క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్ణయం తీసుకుంటారు. ఇందులో కచ్చితంగా ఆమె పేరు ఉండే అవకాశముంది' అని ఆ వర్గాలు తెలిపాయి.