చైనాలో తొలికేసు నమోదైన డిసెంబరు(2019) కంటే చాలా ముందే కరోనా వ్యాప్తి మొదలైందని బ్రిటన్ పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. ఈ వైరస్‌లో జన్యు మార్పులపై తాము క్రోడీకరిస్తున్న వివరాల డేటాబేస్‌ను ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తలు అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. వాటిలో నుంచి 7,600 మంది బాధితులకు సోకిన వైరస్‌ల జన్యుక్రమాలను యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని జెనెటిక్స్ విభాగం పరిశోధకులు విశ్లేషించారు. తాము తీసుకున్న నమూనాల్లో వివిధ దేశాలకు చెందిన బాధితులు, వారికి వైరస్ కూడా వేర్వేరు సమయాల్లో సోకిన వారివి ఉండేలా చూసుకున్నారు.
పరిశోధకులు తెలిపిన ప్రకారం 'తొలి కేసును గుర్తించిన నాటికి చాలాముందే చైనాలో వైరస్ సోకడం ప్రారంభమైంది. కచ్చితంగా చెప్పాలంటే గత ఏడాది నవంబరు నాటికే వ్యాప్తి మొదలై, వేగంగా విస్తరిస్తోంది. అన్ని దేశాల్లోనూ దాని మ్యుటేషన్లు కనిపిస్తున్నాయి. అవి తొలి కేసు నమోదు చేసిన సమయం కంటే ముందే జరిగినట్లు తేలింది. పైగా అన్నింట్లోనూ పోలికలున్నాయి. ఐరోపాలో జనవరి, ఫిబ్రవరిలో తొలి కేసులు నమోదయ్యాయి. కానీ... దానికి రెండు నెలల ముందే అక్కడ వైరస్ వ్యాప్తి జరిగినట్లు జన్యుక్రమాల విశ్లేషణ చెబుతోంది. అదే సమయంలో ఫలానా వ్యక్తి జీరో పేషెంట్ అని నిర్ధారించడానికీ అవకాశమే లేదు. చాలా ఆందోళనకర విషయమేమిటంటే ప్రపంచంలోని 10% జనాభాకు వైరస్ సోకే ప్రమాదముంది' అని వివరించారు.