ప్రపంచంలో మొత్తం 195 దేశాలకుగాను 184 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మరి అనేక దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వ్యాధి పుట్టిన చైనాలో పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. అయితే ఐరోపా దేశాల్లో మాత్రం మరణ మృదంగం కొనసాగుతోంది.
ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి
ఇటలీలో పరిస్థితి తీవ్ర భయానకంగా తయారైంది. ఒక్కరోజులో ఆ దేశంలో రికార్డు స్థాయిలో 627 మంది కొవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 5,986 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇటలీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,021కి చేరింది. మృతిచెందిన వారి సంఖ్య 4,032గా నమోదైంది.
36.6 శాతం అక్కడే..
ఇటలీ మొత్తం జనభా 6 కోట్ల వరకు ఉండగా.. ప్రపంచంలో కరోనా సోకి చనిపోయిన వారిలో 36.6 శాతం ఇటలీలోనే ఉన్నారు. వైరస్ సోకిన వారు స్వీయ నియంత్రణలోకి వెళ్లకపోవడం సహా.. విచ్చలవిడిగా బయటతిరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఇటలీ నిర్బంధం ప్రకటించింది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని పలు నగరాల మేయర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఐరోపా దేశాలలో కరోనా పంజా..
ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనూ.. కరోనా మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 213 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,335 మంది వైరస్ బారినపడ్డారు. స్పెయిన్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,044కు చేరగా.. బాధితులు 20వేలు దాటారు.
ఫ్రాన్స్‌లో 78 మంది చనిపోగా.. కొత్తగా 1,617 మందికి వైరస్ సోకింది. అమెరికాలో మృతుల సంఖ్య 50 దాటగా.. కొత్త కేసుల సంఖ్య 5 వేలకు మించిపోయింది. బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్లలో.. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
ఇరాన్‌లోనూ ఒక్కరోజులో 149 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,237 మందికి వైరస్ సోకింది. పాకిస్థాన్‌లో కేసుల సంఖ్య 481కు చేరింది. వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా అమెరికా మెక్సికో, కెనడా సరిహద్దులను మూసివేసింది.
వుహాన్‌లో కనిపించని వైరస్..
చైనా కట్టుదిట్టమైన చర్యలను విధించింది. ఫలితంగా.. వ్యాధి మొదట బయటపడిన వుహాన్‌లో గడచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఈ పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇది ప్రపంచానికి ఆశాజకమైనదని పేర్కొంది. అయితే వ్యాధి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించిన భారీ సంఖ్యలో ప్రాణ నష్టం తప్పదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించింది డబ్ల్యూహెచ్ఓ. స్వీయ నిర్బంధం ద్వారానే మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది.
సాయం చేయండి..
కరోనా అత్యవస విరాళం కింద భూటాన్ దేశం.. సార్క్ దేశాల నిధికి లక్ష డాలర్లను ప్రకటించింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భూటాన్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలు కూడా తమవంతు సాయం అందించాలని కోరింది.
ఇదీ చదవండి: గుట్టు వీడింది... కరోనా వైరస్ పుట్టింది అలానే...