Conflict in Ukraine: మంటలను ఆర్పేందుకు ఉపయోగపడే నీరే అక్కడ అగ్గి రాజేసింది. రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణమైంది. ఉక్రెయిన్- రష్యా మధ్య చిచ్చుపెట్టిన అంశాల్లో అత్యంత కీలకమైనది డెనిపర్ నదిపై నిర్మించిన ఆనకట్ట. ఈ నిర్మాణం తర్వాతే క్రిమియా దీవికి నీటి సరఫరా తగ్గిపోయింది. ప్రజలకు తాగు, సాగు అవసరాలను తీర్చేలేకపోవడంతో పాటు తమ నౌకాస్థావరాలకు నీటి సరఫరా చేయడానికి అష్టకష్టాలు పడాల్సి రావడం రష్యాను ఆగ్రహానికి గురిచేసింది. కయ్యానికి కాలు దువ్వేలా చేసింది. వివాదానికి కేంద్ర బిందువైన ఆనకట్టను రష్యా సైనికులు శనివారం బాంబులతో పేల్చివేశారు.
ఆధిపత్య పోరులో కేంద్ర బిందువు
ఆధునిక కాలంలో నీటి కోసం జరిగిన తొలి రణం ప్రస్తుత ఉక్రెయిన్-రష్యా యుద్ధం. రెండు దేశాల మధ్య వివాదాలకు ఆది బిందువైన ఈ అంశం ఎందుకో మరుగునపడింది. ఇతరత్రా విషయాలు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. క్రిమియా దీవిని ఇబ్బందుల్లోకి నెట్టిన నీటి సమస్యకు సుదీర్ఘ చరిత్రే ఉంది. జల వనరులపై ఆధిపత్యం కోసం చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. వాటిల్లో రష్యా, స్వీడన్ మధ్య ఉక్రెయిన్‌పై పట్టు కోసం 1709లో జరిగిన రణం కూడా ఒకటి. ఆ తర్వాత 1783, 1856లలోనూ క్రిమియా దీవిని తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం రష్యా యుద్ధాలు చేసింది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయే వరకూ ఉక్రెయిన్... రష్యాలో భాగంగానే ఉంది. 2014లో ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. చుట్టూ సముద్రం ఉండే ద్వీప ప్రాంతమైన క్రిమియాలో 25 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు రష్యన్లే. క్రిమియా దీవిని ఇరుకైన భూభాగం ఉక్రెయిన్‌తో అనుసంధానిస్తుంది. ఆ ప్రాంతం మీదుగానే సోవియట్ యూనియన్ హయాంలో నిర్మించిన కెనాల్ ద్వారా క్రిమియా ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు 80శాతానికి పైగా తీరేవీ. ఉక్రెయిన్‌లోని వివిధ నదుల నుంచి ఆ నీటిని మళ్లించే వారు. అయితే, 2014 రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట నిర్మించడంతో క్రిమియాకు నీటి సరఫరా తగ్గిపోయింది.
రూ.1.13లక్షల కోట్ల వ్యయం
రష్యా 2014 నుంచి ఇప్పటి వరకు క్రిమియాకు నీటి సరఫరా కోసం 1500 కోట్ల డాలర్ల(సుమారు రూ.1.13లక్షల కోట్ల)ను వెచ్చించిందని అంచనా. అయినప్పటికీ సమస్య తీరలేదు. సోవియట్ యూనియన్ హయాంలో అక్కడ 4.02లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యేవి. 2015లో సాగు భూమి 10వేల హెక్టార్లకు తగ్గిపోయింది. 2018కి సాగు భూమి 17వేల హెక్టార్లకు పెరిగినప్పటికీ సమస్య తీవ్రత అలాగే ఉంది. ''ఉత్తర క్రిమియా కాలువకు అడ్డంగా నాజీలు (ఉక్రెయిన్ ప్రభుత్వం) నిర్మించిన ఆనకట్టను మా సైన్యం కూల్చివేసింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించే కార్యక్రమం జరుగుతోంది.'' అని క్రిమియా రిపబ్లిక్ అధినేత సెర్గె అక్సాయ్‌నోవ్ రష్యా మీడియాకు తెలిపారు.
ఖెర్సన్ ప్రాంతంపై పట్టుకు యత్నం
క్రిమియాకు నీటిని సరఫరా చేసే కాలువను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకే రష్యా సైన్యం తొలుత ఖెర్సన్ ప్రాంతం మీదుగా దాడిని ప్రారంభించింది. డాన్‌బాస్‌లోని తమకు అనుకూలురైన వేర్పాటు వాదులకు చేయూతనందించేందుకూ ఇది ఉపయోగపడింది. శీతాకాలంలో రష్యాలోని మిగతా పోర్టులన్నీ మంచులో చిక్కుకుపోతాయి. నల్లసముద్రం ప్రాంతం ఏడాది అంతటా నౌకాయానాలకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లోనూ కార్యకలాపాలకు అనుకూలంగా ఉండే నల్ల సముద్రంలోని (బ్లాక్ సీ) రష్యా నౌకా స్థావరాలకు క్రిమియా, సెవస్తొపోల్ నుంచే నీటి సరఫరా జరుగుతుంది. అందువల్లే రష్యన్ నేతల దృష్టంతా ఎప్పుడూ క్రిమియాపైనే ఉంటుంది.
ఇవీ చూడండి: విరామం అంటూనే.. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల మోత