కొవ్వు మీద యుద్ధాన్ని ప్రకటించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నిర్ణయించారు. ఊబకాయం, దాని రుగ్మతల వల్ల కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి ఊబకాయం ఉంటే.. వారి ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిపాలయ్యే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని బ్రిటన్‌లోని గ్లాస్గో విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
ఊబకాయంతో ముడిపడిన గుండె జబ్బులు, మధుమేహం వంటివి కూడా కొవిడ్ రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో జాన్సన్ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కరోనా వైరస్ సోకి జాన్సన్ కూడా ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఊబకాయం వల్లే ఆయనలో కొవిడ్-19 లక్షణాలు తీవ్రమైనట్లు కొందరు నిపుణులు పేర్కొన్నారు.
బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాంకాక్ సహా బరువు తక్కువగా ఉన్న పలువురు మంత్రులు వేగంగా కోలుకున్నట్లు తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం బ్రిటన్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఊబకాయం ఉంది. వీరి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ) 30 కన్నా ఎక్కువగా ఉంది. ఈ సూచీ అత్యధికంగా ఉన్న పశ్చిమ దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. దీనికి విరుగుడుగా సైకిల్ వాడకం, నడకను ఎక్కువగా ప్రోత్సహించే అవకాశం ఉంది. చక్కెరతో కూడిన శీతల పానీయాలపై ప్రభుత్వం ఇప్పటికే ‘షుగర్ ట్యాక్స్’ను విధించింది.
ఇదీ చూడండి: ఎత్తైన జంట రియాక్టర్లు.. క్షణాల్లోనే నేలమట్టం