బ్రెగ్జిట్ అనేది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. అది కాలానుగుణంగా చరిత్రలో కలిసిపోతుందన్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన అనంతరం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు బోరిస్.
గ్రీన్విచ్లోని చారిత్రక ఓల్డ్ రాయల్ నావల్ కళాశాలలో మాట్లాడిన ఆయన బ్రెగ్జిట్ పదాన్ని ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం గమనార్హం. తన ప్రసంగంలో బ్రెగ్జిట్ పదాన్ని వినియోగించకపోవడంపై విలేకరులు ప్రశ్నించారు.
"ఇది నిషేధం కాదు. అది (బ్రెగ్జిట్) ముగిసిపోయింది. అది బిగ్‌బ్యాంగ్, నార్మన్ కాంక్వెస్ట్ వంటిదని నేను చెప్పట్లేదు. కాలానుగుణంగా మన వెనకున్న చరిత్రలో కలిసిపోతుంది. అది బీ అనే అక్షరంతో ప్రారంభమవుతుందని తప్ప.. ఆ వివాదాస్పద పదాన్ని నేను ప్రస్తావించను. మనకు అవకాశాలున్నాయి. మనకు తగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎక్కడికి చేరుకోవాలో తెలుసు."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి
జనవరి 31తో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ అధికారికంగా బయటకు వచ్చిన నేపథ్యంలో... ఈయూతో యూకే సంబంధాలపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేశారు. కెనడా తరహాలోనే ఐరోపా సమాఖ్యతో ఆచరణాత్మక ఒప్పందాలను ఏర్పరచుకోవాలని యూకే భావిస్తుందని జాన్సన్ వ్యాఖ్యల సారాంశంగా తెలుస్తోంది.
అగ్రదేశాలే తొలి ప్రాధాన్యం..
వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, జపాన్ దేశాలు తమ తొలి ప్రాధాన్యాలుగా బోరిస్ వివరించారు. ఈ జాబితాలో భారత్ లేకపోయినప్పటికీ... ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాలతో ఏకకాలంలో చర్చలు జరపడానికి యూకే అంతర్జాతీయ వాణిజ్య శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.