అమెజాన్ కార్చిచ్చును అదుపు చేసేందుకు జీ-7 దేశాలు ప్రకటించిన ఆర్థికసాయాన్ని బ్రెజిల్ తిరస్కరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్... తన దేశాన్ని, వలసలను జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికింది.
"మేము జీ-7 దేశాల సాయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ ఆర్థికసాయం మా కంటే... యూరోప్‌లో అరణ్యాల పునరుద్ధరణకే ఎక్కువ అవసరం."
"బ్రెజిల్ ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుతమైన దేశం. ఈ దేశం ఎప్పుడూ వలసవాద, సామ్రాజ్యవాదాన్ని అనుసరించలేదు. బహుశా అది ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ లక్ష్యమై ఉండొచ్చు." - ఒనిక్స్ లోరెంజోని, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో చీఫ్ ఆఫ్ స్టాఫ్
మాట మార్చిన బ్రెజిల్
ఇంతకు ముందు అమెజాన్ కార్చిచ్చును నియంత్రించడానికి జీ-7 దేశాలు అందిస్తున్న సాయాన్ని స్వాగతిస్తున్నట్లు బ్రెజిల్ పర్యావరణ మంత్రి రికార్డో సల్లెస్ తెలిపారు. అయితే అధ్యక్షుడు బొల్సొనారో ఆదేశాలతో బ్రెజిల్ మంత్రులు మాట మార్చారు.
20 మిలియన్ డాలర్ల సహాయం..
బియారిడ్జ్లో సోమవారం జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో.... 'వాతావరణం, జీవవైవిధ్యం, మహాసముద్రాల పరిరక్షణ'పై సమావేశం జరిగింది. అమెజాన్ కార్చిచ్చును అదుపుచేయడానికి, అలాగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించాలని అగ్రదేశాధినేతలు నిర్ణయించారు. ఇందుకోసం బ్రెజిల్‌కు 20 మిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్నీ ప్రకటించారు.
ఇదీ చూడండి: 'నేను పర్యావరణ వేత్తను.. ఈ సమావేశం నాకెందుకు'