సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించాడు ఓ బాలుడు. శిశు పక్షవాతంతో బాధపడుతోన్న బ్రిటన్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఓ స్వచ్ఛంద సంస్థ కోసం మారథాన్లో పాల్గొన్నాడు. చేతి కర్ర సాయంతో బుడిబుడి అడుగులు వెసుకుంటూ మొత్తం 26.2 మైళ్ల(42 కిలోమీటర్లు) దూరాన్ని 70 రోజుల్లో పూర్తి చేశాడు . తన ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చివరి లైన్ దాటి విజయవంతంగా తన లక్ష్యాన్ని ముగించాడు టోబిస్ వెల్లర్. ఈ మారథాన్ కోసం రోజు తన తల్లితో కలిసి నడిచే వాడని స్థానికులు తెలిపారు.
టామ్ మూర్ ఆదర్శంతో ...
కరోనా పోరులో ముందుండి పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది కోసం 70 రౌండ్లు నడిచి 10 మిలియన్ పౌండ్లను సంపాదించిన టామ్ మూరే ఆదర్శంతో ఈ నడకను ప్రారంభించినట్లు తెలిపాడు వెల్లర్. తన నడక ద్వారా మొత్తం 50 వేల పౌండ్లు (రూ.47 లక్షలు) సంపాదించాడు. ఈ మొత్తాన్ని పిల్లల ఆసుపత్రి ఛారిటీకి, స్థానిక పిల్లల పాఠశాల అవసరాల కోసం ఖర్చు చేసేందుకు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు.