ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బ్రిటన్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో బ్రిటన్ ముందువరుసలో ఉంది. దీనికి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వ విధానాలే కారణమని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా అంగీకరించారు.
తొలినాళ్లలో వైరస్ కట్టడిలో తాము సమర్థంగా పనిచేయలేకపోయామని తెలిపారు. ఇంకా మెరుగైన చర్యలు తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్ విధింపులో ఆలస్యం చేశామన్న ఆరోపణలు ఉన్నాయని.. ఆ విషయంలో తన పాలకవర్గం ఇంకా ముందు చూపుతో వ్యవహరించి ఉండాల్సిందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన తప్పులన్నింటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్ ఈ స్థాయిలో వ్యాపిస్తుందని తొలినాళ్లలో అంచనా వేయలేకపోయామన్నారు. మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈసారి దాన్ని సమర్థంగా కట్టడి చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రజలు తమ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారని చెప్పారు.
మహమ్మారితో మరణించిన ప్రతి ఒక్కరికి జాన్సన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని చర్యలకు తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకు 2,97,914 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 45,677 మంది మరణించారు. కొత్త కేసుల సంఖ్య మే నెల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. అయితే వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
కొద్ది రోజులు క్రితం బోరిస్ జాన్సన్ కూడా మహమ్మారి బారిన పడ్డారు . పది రోజుల చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఓ దశలో ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించాల్సిన అవసరం వచ్చింది.