ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 5కు పెరిగింది. మరో 17 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నగరంలోని ఇతర చోట్ల కూడా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
మోదీ దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపత్కాలంలో ఆస్ట్రియాకు భారత్ అండగా ఉంటుందని మోదీ చెప్పారు.
కార్యాలయం మూసివేత..
ఉగ్రదాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భారత్లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఆస్ట్రియా ప్రకటించింది. నవంబరు 11వరకు తెరవబోమని తెలిపింది.
వియన్నాలో ఆరు చోట్ల ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన ఓ దుండగుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అతడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ సానుభూతిపరుడని ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రి నెహమార్ తెలిపారు.