ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతాపం సహా జీవన విధానాలపై మార్పులను విశ్లేషించే వెబ్‌సైట్‌ను దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ ఆవిష్కరించింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రజల జీవనం, లాక్డౌన్లో ఎలా మారిందనే విషయాలను ప్రస్తావించింది. ప్రముఖ నగరాల్లోని ప్రజలు జనవరి 13 నుంచి యాపిల్ మ్యాప్స్‌లో చేసిన నేవిగేషన్ రిక్వెస్టుల ఆధారంగా ఈ డేటాను రూపొందించింది.
ప్రజల కదలికలపై ప్రభుత్వాలకు సమాచారం అందించి కొవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయ పడటమే ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశమని యాపిల్ స్పష్టం చేసింది.
ముందు చైనా తర్వాత ఐరోపా
నడక, ప్రయాణాలు సహా ప్రజా రవాణా ఉపయోగించుకోవడంలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు యాపిల్ వెల్లడించింది. కరోనా వైరస్ ఉద్భవించిన చైనా సహా తొలినాళ్లలోనే ప్రభావం చూపించిన హాంకాంగ్, సియోల్ నగరాల్లో జనవరి ద్వితీయార్థం నాటికి 60 శాతం కదలికలు తగ్గినట్లు పేర్కొంది. అనంతరం కొద్ది వారాల్లో ఐరోపా, దక్షిణ అమెరికాలో వైరస్ విజృంభించడం వల్ల ఈ ప్రాంతాల్లో ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు వెల్లడించింది.
ఇటలీలో 90 శాతం
ఓ దశలో కొవిడ్ విస్తృతికి కేంద్ర బిందువుగా మారిన ఇటలీలో పరిస్థితులు దుర్భరంగా మారిపోయినట్లు తెలిపింది యాపిల్. మార్చి తొలివారంలో రోమ్ నగరంలో 90 శాతానికిపైగా ప్రయాణాలు తగ్గినట్లు స్పష్టం చేసింది. అనంతరం రెండు వారాల వ్యవధిలో బ్రిటన్‌లోనూ 90 శాతం చలనాలు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.
అమెరికాలో వైరస్‌కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ నగరంలో రవాణా సహా ప్రయాణికుల నడక సైతం 80 శాతం క్షీణించినట్లు స్పష్టం చేసింది. లాక్డౌన్ చర్యలతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఇదే తరహా ఫలితాలు వచ్చినట్లు యాపిల్ తెలిపింది.
సింగపూర్‌లో జనవరి తర్వాత ఈ గణాంకాలు అంతగా తగ్గకపోయినప్పటికీ... కేసులు పెరగడం వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించిన అనంతరం ప్రయాణాల సంఖ్య పడిపోయినట్లు ఆపిల్ విశ్లేషించింది.
భారత్‌లో
దిల్లీలో ప్రయాణాలు 86 శాతం తగ్గగా.. నడక 80 శాతం క్షీణించినట్లు యాపిల్ వెల్లడించింది. ముంబయిలో నడక 86 శాతం, డ్రైవింగ్ 88 శాతం తగ్గిపోగా.. దేశవ్యాప్తంగా నడక 73 శాతం, డ్రైవింగ్‌లో 81 శాతం తగ్గుదల నమోదు చేసినట్లు యాపిల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
'గోప్యత మాటేంటి?'
మరో దిగ్గజ సంస్థ గూగుల్ సైతం ఇదివరకే ఇలాంటి గణాంకాలు వెలువరించింది. రెండు సంస్థలూ అజ్ఞాత సమాచారం ఉపయోగించే ఈ గణాంకాలు రూపొందించినట్లు ప్రకటించాయి. అయితే పలువురు కార్యకర్తలు మాత్రం యాపిల్, గూగుల్ సంస్థల వ్యక్తిగత సమాచార భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యతిరేక ప్రాజెక్టుల పేరుతో వినియోగదారుల వ్యక్తిగత భద్రతను కాలరాస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చైనా నుంచి భారత్‌కు 6.5 లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు