ఇతని పేరు వాసిల్ టెర్టెకా. ఒక్కడే కష్టపడి సొంతంగా ఓ ఎలక్ట్రిక్ కారు తయారు చేసుకున్నాడు. అదీ కేవలం మూడు నెలల్లోనే. తొలుత ఎలక్ట్రిక్ బైక్ కూడా తయారుచేశాడు. అయితే వర్షంలో తడవకుండా, దుమ్ము బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతోనే ఎలక్ట్రిక్ కారుని రూపొందించాడు.
40 ఏళ్ల క్రితం రేడియో మెకానిక్ కోర్సు చదివారు వాసిల్. ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసు. ఇంకొంత సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని కారును తయారు చేశాడు. కారు కోసం 15 వందల డాలర్లు ఖర్చు చేశాడు. ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల దాకా నడిచే సామర్థ్యం ఈ కారు సొంతం. తయారీలో పాలీకార్బోనేట్ ప్లేట్స్‌ని ఉపయోగించాడు.
"నేను ఎలక్ట్రిక్ కారును చేస్తానంటే జనం నమ్మలేదు. అది జరగని పని అన్నారు. కానీ నేను మొండివాడిని. నాకు ఆలోచన రాగానే ఎంత ఖర్చయినా చెయ్యాలనుకున్నా. ఈ రోజుల్లో డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 45 నిమిషాల్లోనే 25 కిలోమీటర్లు వెళ్లగలను. ఇంకా రోడ్లు సరిగా లేనందువల్ల ఈ సమయం పడుతోంది. వాటిని బాగుచేస్తే ఇంకా త్వరగా వెళ్లగలను."
-టెర్టెకా, కారు రూపకర్త
ఈ కారుకు 3 కిలోవాట్స్ కంటే తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. కాబట్టి ఉక్రెయిన్ చట్టం ప్రకారం దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. స్థానికుల్లో.. ఈ టెర్టెకా కారుకు క్రేజ్ ఎంతుందంటే.. ఎగబడి మరీ స్వీయ చిత్రాలు తీసుకుంటారు. ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తుంటే అందరూ ఆ కారు వైపే చూస్తుంటారు. కారుతోపాటు ఆయనా సెలబ్రిటీ అయ్యారు.
ఇదీ చూడండి: డ్రైవరుపై పాము విసిరి... కారుతో ఉడాయించి...