కర్ణాటకకు చెందిన ఓ జర్నలిజం విద్యార్థినికి అరుదైన అవకాశం లభించింది. బెంగళూరులో నివాసం ఉండే అంబిక ఒక రోజు పాటు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. భారత్, యూకేల మధ్య సంబంధాలు పెంపొందించడం సహా మహిళలకు బ్రిటన్ అందిస్తున్న సహకారానికి గుర్తింపు తెచ్చేందుకు పోటీలు నిర్వహించి అంబికాను ఎంపిక చేశారు బ్రిటన్ అధికారులు. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి తెలుసుకోవడానికి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌గా ఒక రోజు పాటు బాధ్యతలు చేపట్టారు.
ప్రత్యేక సమావేశాలు..
ప్రస్తుతం బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్‌గా ఉన్న జెరెసీ పిల్మోరే స్థానంలో బాధ్యతలు చేపట్టిన అంబికా అనంతరం పలు సమావేశాలు నిర్వహించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
"ఈ రోజు పూర్తిగా ప్రణాళిక ప్రకారం అద్భుతంగా సాగుతోంది. బ్రిటీష్ హైకమిషనర్ కార్యాలయ సిబ్బందిని బెంగళూరులో ఈరోజు కలుసుకున్నాను. అనంతరం టెస్కోను సందర్శించి దాని విధివిధానాలు సహా భారత్, యూకే మధ్య సంబంధాలను పరిశీలించాను. ప్రత్యేకంగా లింగ సమానత్వంపై పోరాడే సామాజిక కార్యకర్త విద్యాలక్ష్మి గారిని అక్కడ కలుసుకున్నాను.-
-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్
బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‌గా తనకు అరుదైన అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు అంబికా.
'ఇది ఒక్కరోజు పని కాదు. ఈ హోదాకు చేరుకోవడం, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సహా భారత్-యూకేల మధ్య సంబంధాలపై అవగాహన పెంచుకునేందుకూ ఇదో అద్భుత అవకాశం. ఈ ప్రక్రియ కేవలం ఆరంభం మాత్రమే. ఇదొక గొప్ప అనుభూతి, చాలా ఆనందం కలిగింది.'
-అంబికా, ఒకరోజు బ్రిటన్ డిప్యూటీ కమిషనర్
మహిళల ప్రాధాన్యాన్ని తెలియజేయడానికే
ఈ సందర్భంగా మాట్లాడిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ బెడ్ఫోర్డ్...మహిళలకు బ్రిటన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. బ్రిటన్‌లోనే కాక అంతర్జాతీయంగా కూడా మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు.
'అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేశాం. మా పరిధిలో ఉన్న భారతీయ నెట్‌వర్క్‌లలో పోటీలు జరిపాం. డిప్యూటీ హైకమిషనర్ హోదాను చేపట్టడానికి ఈ వారం పోటీలు నిర్వహించాం. యూకేతో పాటు అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారం సహా వారి గళాన్ని వినిపించడానికి బ్రిటన్ అందిస్తున్న సహకారాన్ని తెలిపేందుకే ఒకరోజు డిప్యూటీ కమిషనర్ కార్యక్రమం చేపట్టాం. అంబికా ఈ రోజు సమావేశానికి అధ్యక్షత వహించారు. పెట్టుబడులు, వాణిజ్యం, రాజకీయం వంటి అంశాల్లో బ్రిటన్, కర్ణాటకల మధ్య బంధం బలోపేతం చేయడానికి ఇక్కడ అధికారులు చేసే విధులను వారు పరిశీలించారు.'
--బెడ్ఫోర్డ్, బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్.
బ్రిటన్‌లో మంత్రిత్వ శాఖలను మహిళలే ఎక్కువగా నిర్వర్తిస్తున్నారని బెడ్ఫోర్డ్ తెలిపారు. విదేశీ రాయబారులలో సగానికి పైగా మహిళలు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక రోజు హైకమిషనర్..
ఇటీవల 'ఒకరోజు హైకమిషనర్' పేరుతో నిర్వహించిన పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఆయేషా ఖాన్ విజయం సాధించారు. దీంతో భారత్‌లో బ్రిటన్ అత్యున్నత హోదా అయిన హైకమిషనర్ హోదాను ఒక రోజు పాటు నిర్వర్తించారు. అక్టోబర్ 4న ఆయేషా విధులు నిర్వర్తించినట్లు ఓ ప్రకటనలో బ్రిటన్ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్‌పై మోదీ చివరి అస్త్రాన్ని వినియోగించేశారు'