కొవిడ్-19 రోగుల మృతికి ప్రధాన కారణాలపై పరిశోధన నిర్వహించారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. వృద్ధాప్యం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలే వైరస్ సోకిన వారి మృతికి ముఖ్య కారకాలని తేల్చారు. ఈ అధ్యయనాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్(బీఎంజే)లో ప్రచురించారు.
అధ్యయనం ప్రకారం 50 ఏళ్లు పైబడిన వారు, ప్రత్యేకించి పురుషులు, ఊబకాయం, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారే కొవిడ్ కారణంగా మృతిన చెందిన వారిలో అధిక సంఖ్యలో ఉన్నారు. లివర్‌పూల్ యూనవర్సిటీ సహా ఇతర శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో ఇదే అతి పెద్దది.
బ్రిటన్‌లోని 43 వేల మంది రోగుల నుంచి వివరాలు సేకరించి ఈ పరిశోధన నిర్వహించారు. ఇప్పటి వరకు చైనా అధ్యయనాల ఆధారంగా మాత్రమే కరోనా రోగుల మృతికి ప్రధాన కారకాలను అంచనా వేస్తున్నారని, ఇతర దేశాల్లోని రోగులకు సంబంధించిన సమాచారం లోపించిందని పరిశోధకులు చెప్పారు. ఫిబ్రవరి 6 నుంచి ఏప్రిల్ 19వరకు ఇంగ్లాండ్‌లోని 20,133 మంది రోగుల ఆరోగ్య వివరాలు విశ్లేషించినట్లు వివరించారు. రోగుల సగటు వయస్సు 73 ఏళ్లని, వారిలో పురుషులే అధికమని పేర్కొన్నారు.
మెకానికల్ వెంటిలేషన్ చికిత్స తీసుకుంటున్న రోగుల ఫలితాలు మరీ పేలవంగా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. వారిలో 37 శాతం మరణించగా, 46 శాతం మంది ఆస్పత్రులలోనే చికిత్స పొందుతున్నారు. 17 శాతం మాత్రమే డిశ్చార్జి అయ్యారు.
పరిశోధన ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకున్నామని, ఇతర దేశాల వివరాలతో వీటిని పోల్చి చూస్తారని శాస్త్రవేత్తలు అన్నారు.