Russian crude oil India: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారైన రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడం వల్ల క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 130డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికా సహా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ వంటి దేశాల్లో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలోనూ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాతో భారత ఇంధన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. క్రూడాయిల్‌ను డిస్కౌంట్‌లో ఇస్తామన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూ దేశీయ ఇంధన సంస్థలు తక్కువ ధరకే చమురు కొనేందుకు క్యూ కడుతున్నాయి. గత వారం దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీ అయిన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC రష్యా నుంచి ఇంధన కొనుగోలుకు ముందుకు రాగా.. తాజాగా అదే బాటలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్- హెచ్‌పీసీఎల్ వచ్చి చేరింది.
20 లక్షల బ్యారెళ్లకు ఒప్పందం..
రష్యా నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును.. దిగుమతి చేసుకునేందుకు హెచ్‌పీసీఎల్ ఒక ట్రేడర్ ద్వారా ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రస్తుత బ్యారెల్ ధరతో పోలిస్తే.. 20 నుంచి 25 డాలర్ల కంటే తక్కువకే రష్యా క్రూడాయిల్‌ను సరఫరా చేయనుంది. అటు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్-ఎంఆర్‌పీఎల్ కూడా ఒక మిలియన్ బ్యారెల్ చమురు కొనుగోలుకు టెండర్ వేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గతవారం ఐఓసీ కొనుగోలు చేసిన 30లక్షల బ్యారెళ్లతో పాటు తాజా హెచ్‌పీసీఎల్ ఒప్పందంతో కలిపి మే నెలలో 50 లక్షల బ్యారెళ్ల చమురు భారత్ చేరే అవకాశముంది. మరోవైపు చమురు రవాణాతో పాటు బీమాకు సంబంధించిన అన్ని అంశాల విషయంలో రష్యా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూపాయి-రూబెల్ మారకం పద్ధతిలోనే చెల్లింపులకు ఇంధన సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రిలయన్స్ నో..
రష్యా చమురును కొనుగోలు చేయాలనుకోవడం లేదని ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రష్యా చమురుపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. రిలయన్స్ గత కొన్నేళ్లుగా తమ చమురు శుద్ధి కేంద్రాల కోసం రష్యా నుంచి ఉరల్స్ క్రూడ్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది.
ఇదీ చూడండి: దేశంలో పెరిగిన ఇంధన విక్రయాలు.. కారణం ఇదే!