కరోనా బారిన పడి కోలుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనాన్ని ది లాన్సెట్ సైకియాట్రి జనరల్ ప్రచురించింది. దాదాపు 2.36 లక్షల మంది కొవిడ్ బాధితులపై ఈ పరిశోధన నిర్వహించగా, ఇందులో అమెరికాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. కొవిడ్ బాధితులపై చేసిన అధ్యయనంలో పరిశోధకులు ముఖ్యంగా నాడీ, మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించారు.
ఇందులో 17 శాతం మందిలో ఆత్రుత (anxiety) సర్వ సాధారంగా కనిపించింది. మరో 14 శాతం మంది నిద్రలేమి వంటి మానసిక సమస్యలతో కలత చెందుతున్నట్లు తేలింది. ఇక కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన వారిలో నాడీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సాధారణ లక్షణాలు ఉన్న కొవిడ్ బాధితుల్లో ఈ సమస్యలను తక్కువగా గమనించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ప్లూ లేదా ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పోలిస్తే కరోనా వచ్చిన వారిలో 44 శాతం మానసిక, 16 శాతం శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే కరోనా బారిన పడ్డ ప్రతి 50 మంది వ్యక్తుల్లో మెదడును ప్రభావితం చేసే స్ట్రోక్‌ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇదీ చూడండి: 'కొవిడ్‌తో వారిలో తీవ్రమైన అసమానతలు'