ప్రపంచ వ్యాప్తంగా కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం ఊహించని రీతిలో పెరిగిపోతోంది. ప్రపంచంలో వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికిపైగా (55శాతం) వాటా కేవలం 20 సంస్థలదేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్లాస్టిక్ వేస్ట్-మేకర్స్ ఇండెక్స్ ప్రకారం, కేవలం మూడు కంపెనీలే ప్రపంచంలోని 16శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను (పాలిమర్స్) ఉత్పత్తి చేస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు కావాల్సిన ముడిపదార్థాలను తయారుచేసే దాదాపు వెయ్యి పరిశ్రమల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం లండన్‌కు చెందిన పరిశోధకులు తాజా నివేదిక రూపొందించారు.
20 సంస్థలదే..
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తోన్న వాటిలో 90శాతం కేవలం వంద కంపెనీల నుంచే వస్తున్నట్లు ఆండ్రూ అండ్ నికోలా ఫోర్రెస్ట్స్ మైండెరో ఫౌండేషన్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి ఏటా ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 13కోట్ల టన్నులు ఉంటుండగా.. వీటిలో సగానికి పైగా కేవలం 20 అంతర్జాతీయ సంస్థలదేనని తెలిపింది. వీటిలో బహుళజాతి సంస్థలతో పాటు చమురు, గ్యాస్ కంపెనీలదే అగ్రస్థానం. ఒకేసారి వాడి పడవేసే ప్లాస్టిక్ పదార్థాల వినియోగంలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా, దక్షిణకొరియా, యూకే, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ముందువరుసలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఒక ఏడాది( 2019లో) ఒక వ్యక్తి సగటున 59కిలోల వ్యర్థాలకు కారణమవుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇది అమెరికాలో సగటున 53 కిలోలు, దక్షిణ కొరియా, యూకేలలో 44కిలోలు, జపాన్‌లో 37కిలోలుగా ఉన్నట్లు తెలిపింది.
ధనిక దేశాల్లో ప్లాస్టిక్ నిర్వహణ పేలవం..
ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న సంస్థల్లో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎక్జాన్ మొబిల్ సంస్థ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఈ సంస్థ ఏడాదికి 59లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తోంది. ఇక డౌ కెమికల్స్ నుంచి 55లక్షల టన్నులు వస్తుండగా, చైనాకు చెందిన సినోపెక్ సంస్థ 53లక్షల ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇలా ప్రపంచం మొత్తం విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పేలవంగా ఉండటం వల్ల కాలుష్యం మరింత ఎక్కువ అవుతున్నట్లు పర్యావరణవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ముప్పుగా..
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువైంది. ఇలా ప్రపంచంలో దాదాపు 55శాతం ప్లాస్టిక్ వ్యర్థాలకు చమురు, గ్యాస్ సంస్థలతో పాటు బహుళజాతి సంస్థల పాలిమర్స్ కారణమవుతున్నాయి. వీటికితోడు ఒకేసారి వాడే మాస్కులు, సీసాల నుంచి ఆహార పదార్థాల ప్యాకింగ్, ప్లాస్టిక్ బ్యాగుల వరకు వివిధ వస్తువుల రూపంలో ఉండే ప్లాస్టిక్ వస్తువులు చివరకు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఇలా ఒకేసారి వాడి పడేసే వస్తువులతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా ఏర్పడుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుచేత సహజవాయు (పెట్రోకెమికల్) సంస్థలు పాలిమర్స్ ఉత్పత్తి తగ్గించడం, ఇప్పటికే పర్యావరణంలో భారీగా పేరుకుపోయిన వ్యర్థ్యాలను రీసైకిల్ చేయడం వంటి చర్యలను చేపట్టాలని తాజా నివేదిక సూచించింది. లేనట్లయితే ఇప్పటికే వివిధ రూపాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర కాలుష్యానికి కారణమవుతాయని తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: ''సింగపూర్ స్ట్రెయిన్‌తో ముప్పు' వ్యాఖ్యల్లో నిజం లేదు'
ఇదీ చూడండి: ఓలీ సర్కారుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట