నోబెల్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పురస్కార ప్రదానోత్సవాన్ని ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా వర్చువల్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు నార్వే నోబెల్ కమిటీ అధికారులు.
డిజిటల్‌గా జరిగే ఈ వేడుకల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఓస్లేలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది నోబెల్ కమిటీ.
"ప్రస్తుత పరిస్థితుల నడుమ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. వచ్చే ఏడాది ఎప్పటిలాగే.. ఓస్లే సిటీ సెంట్రల్ హాల్లో నిర్వహిస్తామని మేం ఆశిస్తున్నాం."
-- నోబెల్ కమిటీ
నోబెల్ బహుమతి ప్రదానోత్సవాన్ని నార్వే రాజధాని ఓస్లో లోని సిటీ హాల్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. అక్కడ ప్రస్తుతం మహమ్మారి ఉద్ధృతి కొనసాగతున్నందున తాజా నిర్ణయం తీసుకుంది నోబెల్ కమిటీ. పురస్కార వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా.. ఏటా డిసెంబర్ 10న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈ సారి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ)ని వరించింది.