బ్రిటన్ పార్లమెంటులో ఈసారి ప్రవాస భారతీయుల గళం పెరగనుంది. కొత్తవారితో కలిపి మొత్తం 15 మంది ప్రవాస భారతీయులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఏడుగురు, ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఏడుగురు భారత సంతతి వ్యక్తులు విజయం సాధించారు.
జాబితాలో వీరే..
హోంశాఖ మాజీ కార్యదర్శి ప్రీతి పటేల్, ఇన్ఫోసిన్ సహ-వ్యవస్థాపకుడు ఆర్. నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్, అలోక్‌శర్మ, శైలేష్ వర, సువెల్లా బ్రవర్‌మన్, ప్రీత్ కౌర్ గిల్, తన్‌మంజీత్‌సింగ్ దేశీ, వీరేంద్రశర్మ, వలేరి వజ్ తిరిగి ఎన్నిక కాగా......కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన్ మోహింద్ర, క్లయిరో కౌటినో, లేబర్ పార్టీ తరఫున నవేంద్రు మిశ్రా, లిబరల్ డెమొక్రాట్స్ తరఫున మునిర విల్సన్ తొలిసారి బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.
బ్రిటన్ పార్లమెంటులో ప్రతి 10మంది సభ్యుల్లో ఒకరు మైనారిటీ వర్గానికి చెందిన వారుండటం గమనార్హం.
బోరిస్ ఘన విజయం
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. 650 సీట్లలో దాదాపు 363 సీట్లను గెలుపొంది బోరిస్ జాన్సన్ విజయఢంకా మోగించారు. బ్రెగ్జిట్ నినాదంతో భారీ మెజార్టీ సాధించారు. మరోసారి బోరిస్ ప్రధాని కానుండటం వల్ల బ్రెగ్జిట్ ఇక లాంఛనమే కానుంది.
ఇదీ చూడండి: బ్రిటన్ ప్రధానిగా మరోసారి బోరిస్- ఇక బ్రెగ్జిట్ లాంఛనమే!