1918 ప్రాంతంలో ప్రపంచాన్ని స్పానిష్ ఫ్లూ పట్టి పీడించింది. మళ్లీ వందేళ్ల తర్వాత కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతోంది. ఈ రెండు మహమ్మారుల బారిన పడి విజయం సాధించారు 106 సంవత్సరాల అనా డెల్. స్పెయిన్‌కు చెందిన అనా 1913లో జన్మించారు. ప్రస్తుతం కరోనా మాదిరిగానే.. నాడు 1918 నుంచి 1920 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ విజృంభించింది. అప్పట్లోనే 500 మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకింది. వారిలో అనా కూడా ఉన్నారు. 1918లో చిన్నారిగా ఉన్న, నాటి మహమ్మారి స్పానిష్ ఫ్లూను తట్టుకుని బతికారు.
ఇప్పుడు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. 102 సంవత్సరాల అనంతరం అనాకు ఇప్పుడు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మరి దెబ్బకు ఆ దేశంలో 22,524 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో 106 సంవత్సరాల అనా.. కొవిడ్-19 బారిన పడి మళ్లీ కోలుకున్నారు. స్థానిక పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్‌లో 60 మంది ఇతర కొవిడ్-19 బాధితులతో పాటు ఆమె కూడా చికిత్స పొందారు. కొద్ది రోజుల తర్వాత కోలుకోవడం వల్ల వైద్యులు ఆమె డిశ్చార్జి చేశారు. ఇంకో ఆరునెలల్లో ఆమెకు 107 సంవత్సరాలు నిండుతాయి. కరోనాను జయించిన అతి పెద్ద వయస్కురాలిగా నెదర్లాండ్స్‌కు చెందిన కొర్నీలయా రాస్ పేరున రికార్డు ఉంది. అయితే స్పానిష్ ఫ్లూ, కరోనా రెండింటినీ తట్టుకున్న వారిలో అనా వయస్సే అతి పెద్దదట. అయితే ఆమె వయస్సు దృష్ట్యా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇదీ చూడండి: ముక్కుకు బదులు కళ్లకు మాస్క్- దేశాధ్యక్షుడిపై జనం సెటైర్