ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మూలాలపై అంతర్జాతీయ, చైనా శాస్త్రవేత్తల బృందం తమ సంయుక్త పరిశోధన నివేదికను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నాలుగు సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లు నిపుణులు వెల్లడించారు.
ఈ మహమ్మారి ఏ విధంగా వ్యాపించిందనే అంశంపై అమెరికా, చైనా వంటి దేశాల మధ్య కొన్ని నెలలపాటు మాటల యుద్ధం నడిచింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయినట్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ క్రమంలో నివేదిక విడుదలవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నివేదికను మార్చి తొలినాళ్లలోనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు వెల్లడిస్తారనేది ప్రస్తుతానికి ప్రకటించలేదు డబ్ల్యూహెచ్ఓ. ఈ నివేదిక పలు అంశాలకు బలమైన సమాధానాలతో పాటు పలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
10 మంది శాస్త్రవేత్తలు..
ఈ నివేదిక రూపొందించటంలో 10 మంది అంతర్జాతీయ అంటువ్యాధుల నిపుణులు, డేటా శాస్త్రవేత్తలు, పశువైద్య, ఆహార భద్రత, ల్యాబ్ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా చైనాలో పర్యటించిన బృందంలో సభ్యులు.
" వైరస్ మూలాలపై పరిశోధన చేసేందుకు ఈ నివేదికను తొలి అడుగుగా నేను భావిస్తున్నా. డబ్ల్యూహెచ్ఓ కూడా ఇదే చెప్పే అవకాశం ఉంది. ఈ నివేదిక సంపూర్ణగా లేదని పలువురు విమర్శించే అవకాశం లేకపోలేదు. "
- మాథ్యూ కవనాగ్, జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం గ్లోబల్ హెల్త్ పాలసీ డైరెక్టర్
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ పాశ్చర్ ఇన్స్టిట్యూట్లో ఎపిడెమియాలజిస్ట్, బృంద సభ్యుడు వ్లాదిమిర్ డెడ్కోవ్.. వైరస్ మూలలపై నాలుగు అంశాలను కీలకంగా పేర్కొన్నారు. మొదటిది.. గబ్బిలాల నుంచి ఓ జంతువుకు, అక్కడి నుంచి మనిషికి. రెండోది.. నేరుగా గబ్బిలం నుంచి మనిషికి. మూడోది.. కలుషితమైన ఘనీభవించిన ఆహార ఉత్పత్తుల ద్వారా వ్యాప్తి. నాలుగోది వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు.. చైనా బృందం.. కోల్డ్ చైన్‌గా పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విభాగం ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు అనుమానించింది. అయితే.. ఈ రెండు వాదనలు అంతగా ప్రభావితంగా లేవని డెడ్కోవ్ పేర్కొన్నారు. ఘనీభవించిన ఆహార పదార్థాల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'కొన్నేళ్లల్లో కరోనా పుట్టుకపై క్లారిటీ'