యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని రాజధాని సనాలో.. ఓ ఆయుధ గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్న పిల్లలతో సహా 13 మంది మరణించారు. మరో 110 మందికిపైగా గాయపడ్డారని వైద్యాధికారులు తెలిపారు.
సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలే ఈ గిడ్డంగిపై వైమానిక దాడిచేసాయని హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు. ఈ గిడ్డంగిలో హౌతీలు ఆయుధాలు నిల్వచేశారని ఆడెన్లోని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ తెలిపింది. అయితే... ఈ దాడితో తమకు సంబంధం లేదని సౌదీ సంకీర్ణం స్పష్టం చేసింది.
ఇరాన్ సహకారం ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు 2014 నుంచి యెమెన్ రాజధాని సనాను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వీరితో 2015 నుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు పోరాడుతూనే ఉన్నాయి. పరస్పర దాడుల్లో వేలాది మంది ప్రజలు బలయ్యారు. నిరంతర అశాంతి వల్ల యెమెన్ అరబ్ ప్రాంతంలోని అత్యంత పేద దేశంగా మారి క్షామంతో అల్లాడుతోంది.