Xi Jinping to Meet Vladimir Putin: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా తమ ఆకాంక్షలకు అనుగుణంగా రష్యాతో స్నేహగీతం పాడుతోంది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధినేత జిన్‌పింగ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
ఈ ప్రకటనలో నాటో దళాల విస్తరణను తక్షణమే నిలిపేయాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. వన్ చైనా విధానానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్న రష్యా అధినేత పుతిన్ తెలిపారు. తైవాన్ చైనాలో భాగమే అని ప్రటించారు. ఏ రూపంలోనైనా తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. తైవాన్ చైనాలో విడదీయరాని భాగమని పుతిన్ అన్నారు. ఈ ప్రకటనలో అమెరికాపై పుతిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాటో దళాల విస్తరణ అంటూ అమెరికా తమపై ఒత్తిడి పెంచుతోందని ఆరోపించారు.
China Russia Relations: ఈ సమావేశంలో రష్యా- చైనా మధ్య భారీ గ్యాస్ ఒప్పందం కూడా జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాలకు పశ్చిమ దేశాలతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పుతిన్- జిన్‌పింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా గ్లోబల్ మిస్సైల్ డిఫెన్స్ అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నేతృత్వంలోని నాటో దళాల విస్తరణను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ విధానాలను విడిచిపెట్టాలని సూచించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమెరికా బలగాల మోహరింపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Ukraine NATO: ఉక్రెయిన్ అంశంలో పశ్చిమ దేశాలతో నెలకొన్న ప్రతిష్టంభనపై పుతిన్ స్పందించారు. నాటోలో కొత్త సభ్య దేశాల చేరికను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఐరోపాలో చట్టబద్ధమైన భద్రతా హామీలను రూపొందించేందుకు రష్యా చేసిన ప్రతిపాదనలకు చైనా మద్దతు తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తే తీవ్ర ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు మరింత పెంచాలని చైనా-రష్యా నిర్ణయించాయి.
ఇదీ చదవండి: ఐరోపాకు అమెరికా బలగాలు- పుతిన్ తీవ్ర ఆరోపణలు