కరోనా బాధితులకు చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను భారత్ తమకు ఎగుమతి చేయకుంటే ఆ నిర్ణయం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని.. సానుకూల సమాధానమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ పాతకాలపు, చౌకైన ఔషధం. మలేరియా చికిత్సకు వినియోగించే ఈ మాత్రల్ని.. ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా నివారణకు ఆచరణీయ పరిష్కారంగా పేర్కొన్నారు ట్రంప్. కొవిడ్-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. అమెరికా ఇప్పటికే 29 మిలియన్ డోసుల మేర హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిల్వచేసి పెట్టుకుందని స్వయంగా వెల్లడించారు ట్రంప్.
''ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే ఆయన(మోదీ) నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివారం ఆయనతో మాట్లాడాను. క్లోరోక్విన్ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కరోనా పరిస్థితులపై ఇరుదేశాధినేతలు ఆదివారం ఫోన్లో సంభాషించారు. కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ను కోరారు ట్రంప్.
ఇటీవలే నిషేధం...
కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కూడా ఇటీవలే సూచించింది. ఈ నేపథ్యంలో 'హైడ్రాక్సీ' సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్ కొద్దిరోజుల కిందట నిషేధం విధించింది.
అమెరికా ఆశలు..
ఔషధ రంగంలో అమెరికాకు భారత్ సుదీర్ఘకాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్ జీ వెల్స్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సందిగ్ధంలో భారత్...
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.