ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 65 లక్షల 75వేలకు చేరువైంది. కొవిడ్ కారణంగా దాదాపు 3లక్షల 90 వేల మంది మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు 31 లక్షల 70వేల మందికిపైగా బాధితులు కోలుకున్నారు.
అమెరికాలో ఆగని ఉద్ధృతి..
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే 20వేల మందికిపైగా వైరస్ సోకగా మొత్తం కేసుల సంఖ్య.. 19లక్షలు దాటింది. మరో ఒక వెయ్యి 80 మందికిపైగా మరణించగా.. మృతుల సంఖ్య లక్షా 9వేలు దాటింది. బ్రెజిల్ లో వైరస్ వ్యాప్తి..... రోజురోజుకూ పెరుగుతోంది. మరో 27వేలమందికిపైగా కరోనా నిర్ధరణకాగా ఆ దేశంలో మొత్తం కేసులు 5లక్షల 84వేలు దాటింది. ఇప్పటివరకు 32వేలమందికిపైగా చనిపోయారు. రష్యాలో మరో 8వేల 5వందలకుపైగా మంది వ్యాధి బారినపడ్డారు. మొత్తం బాధితులు 4లక్షల 32వేలు దాటగా....5వేల 215మంది ప్రాణాలు కోల్పోయారు.
బ్రిటన్లో మరో 18వందలకుపైగా కేసులు బయటపడగా కేసులు 2లక్షల 80వేలకు చేరువయ్యాయి. మరణాల సంఖ్య 40వేలకు చేరువైంది. మెక్సికోలో 3వేల 9వందల మందికి వైరస్ సోకగా కేసుల సంఖ్య లక్ష దాటింది. మరణాల సంఖ్య 11వేల 729కి పెరిగింది. చిలీలోనూ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దాదాపు 5వేల కొత్త కేసులతో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 13 వేలు దాటింది. 12వందల 75 మంది మరణించారు. పాకిస్థాన్ లో మరో 4వేలమందికిపైగా కొవిడ్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 85వేలు దాటింది. ఇరాన్ లో 3వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు లక్షా 60వేలకు దాటగా.. ఇప్పటివరకు 8వేల 12 మంది ప్రాణాలు కోల్పోయారు.