ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఏడు రోజుల్లోనే 52లక్షల 36వేల 922 వైరస్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతకముందు.. ఈ ఏడాది జనవరిలో నమోదైన 50.04 లక్షల కేసులే గరిష్ఠంగా ఉండేవి.
అంతర్జాతీయంగా.. కొద్ది రోజులుగా రోజుకు సగటున 7 లక్షలకుపైగా కొత్త వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 14.38 కోట్లకు చేరింది. మహమ్మారి సోకిన వారిలో 30.61 లక్షలు దాటింది.
ఐరోపాలో కరోనా కేసులు 3 శాతం మేర తగ్గగా.. ఇతర ప్రాంతాల్లో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో 94 శాతం, ప్రపంచ వ్యాప్తంగా 28 శాతం కొత్త కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి.
తొలి 10కి 9 నెలలు.. 30కి 3 నెలలు
ఇక మరణాల విషయానికొస్తే.. గత వారంలోనే కొవిడ్ మృతుల సంఖ్య 30లక్షలు దాటినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి 10లక్షల మరణాలు నమోదయ్యేందుకు 9 నెలల సమయం పట్టగా.. కేవలం మూడు నెలల్లోనే 30 లక్షలకు చేరింది.