శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమాన్ని ప్రపంచ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి 'నిజంగా భయంకరమైనది' అని బ్రిటన్ ప్రధాని థెరిసా మే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులు బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని చర్చిలు, హోటల్లో ఉగ్రవాదుల జరిపిన వరుస బాంబు దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బ్రిటిష్, డచ్, అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జపాన్ దేశీయులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఏకం కావాలి....
ఉగ్రవాదుల మారణహోమాన్ని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని 'నిజంగా భయంకరమైనది' అని పేర్కొన్నారు.
"మనమంతా ఏకం కావాలి. భయపెట్టడం ద్వారా ఎవరూ తమ అభిమతాన్ని మనపై రుద్దలేరని నిరూపించాలి" అని థెరిసా మే అన్నారు.
"శ్రీలంకలోని చర్చ్‌లు, హోటళ్లపై జరిగిన దాడులు నిజంగా భయంకరమైనవి. ఈ విషాధ సమయంలో బాధితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."
- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని ట్వీట్
"శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా హృదయపూర్వక సానుభూతి తెలుపుతోంది. ఈ భయంకర సమయంలో శ్రీలంకకు మా పూర్తి మద్దతు, చేయగలగిన సహకారం అందిస్తాం."
- స్కాట్ మారిసన్, అస్ట్రేలియా ప్రధాని
"ఉగ్రవాదుల చర్యలను న్యూజిలాండ్ తీవ్రంగా ఖండిస్తోంది. అసువులు బాసిన వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాం. బాధితులు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాం. ఇంత మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు పశ్చాత్తాపం కలిగించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను."
- జెసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని
ఇదీ చూడండి: శ్రీలంకలో 8 దాడులు- 165 మంది మృతి