కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. ఇరాన్లో తాజాగా వైరస్ బారిన పడి 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 92కు చేరుకుంది. మరో 2,922 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ నివారణకు సైన్యాన్ని రంగంలోకి దించింది.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో మాత్రం కరోనా నమోదైన కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బుధవారం 435 కొత్త కేసులను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇది మంగళవారం ప్రకటించిన 851 కేసుల్లో సగం కావడం గమనార్హం. కరోనాకు కేంద్ర బిందువైన చైనా తరువాత అంతగా నష్టపోయిన దేశం దక్షిణ కొరియానే. ప్రస్తుతానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 32కి చేరుకోగా, 5,621గా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనాను కట్టడి చేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఇప్పటికే 10 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్‌ను ప్రతిపాదించింది.
ఇరాక్‌లో మొదటి మరణం..
ఇరాక్‌లో కరోనా వల్ల తొలి మరణం నమోదైంది. ప్రస్తుతం ఆ దేశంలో 31 పాజిటివ్ కేసులున్నాయి.
చైనాలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా 2,981 మంది మరణించారు. 80,270 మంది వైరస్ బారిన పడ్డారు. తమ దేశంలో పర్యటిస్తున్న 6700 మంది ప్రయాణికుల్లో 75 మందికి కరోనా సోకినట్లు చైనా కస్టమ్స్ అధికారులు తెలిపారు.
టాయిలెట్ పేపర్ కొనుగోళ్లపై పరిమితి
కరోనా భయాల నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని అతిపెద్ద సూపర్ మార్కెట్... టాయిలెట్ పేపర్ కొనుగోళ్లపై పరిమితి విధించింది. ఒక వ్యక్తి నాలుగు ప్యాకెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తోంది. ఎక్కువ మంది వినియోగదారులకు టాయిలెట్ పేపర్లు అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
బ్లాక్ మార్కెట్లో 'మాస్క్'
ఇండోనేసియాలో కరోనా భయాలతో.. మాస్కుల ధరలు ఆకాశానికి ఎగిశాయి. రంగంలోకి దిగిన పోలీసులు జకార్తాలోని ఓ గిడ్డంగిలో అక్రమంగా దాచిన 5 లక్షల ఫేస్ మాస్కులను స్వాధీనం చేసుకున్నారు.
హజ్మత్ సూట్లపై బ్యాన్
కరోనాతో పోరాడటానికి అనువుగా రష్యా... శస్త్ర చికిత్స కోసం వినియోగించే ఫేస్ మాస్కులు, హజ్మత్ సూట్లు, రెస్పిరేటర్ల ఎగుమతులపై నిషేధం విధించింది.
ఇదీ చూడండి: కరోనాపై వదంతుల వ్యాప్తికి ఫేస్బుక్ అడ్డుకట్ట