World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో క్రితం రోజు కంటే మంగళవారం రెట్టింపు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా 3,507 కేసులు వెలుగుచూసినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లోనే(2,601) వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం కంటే 1,337 కేసులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు నగరాల్లో లాక్డౌన్ వంటి ఆంక్షలు అమలు చేస్తోంది చైనా సర్కారు. జీరో కొవిడ్ విధానంతో కఠిన లాక్‌డౌన్‌లు విధించినప్పటికీ కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది.
దీంతో కరోనా పరీక్షల కోసం అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు. చిన్నారులు సైతం టెస్టులు చేయించుకుంటున్నారు.
South Korea Covid Cases
దక్షిణ కొరియాను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. గడిచిన ఏడు రోజులుగా సగటున 3,37,000 కేసులు నమోదవుతుండగా.. అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. కరోనా ధాటికి ఒక్కరోజే 293 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. మంగళవారం ఒక్కరోజే 3,62,283 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 72 లక్షలకు చేరింది.
మరో 1,196 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఐసీయూల్లో 30 శాతం కంటే ఎక్కువ ఇప్పటికీ అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ వైద్య మౌలిక సదుపాయాలు విస్తరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగి.. రాబోయే వారాల్లో ఆసుపత్రి వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు.
దేశంలో 62 శాతం మందికి బూస్టర్ డోసు టీకా అందించినట్లు అధికారులు తెలిపారు.
UK Travel Restrictions
బ్రిటన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనలను దశలువారీగా సడలిస్తున్న బ్రిటన్.. తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సైతం ఎత్తివేసింది. దేశంలోకి వచ్చినవారు లొకేటర్ ఫామ్‌ను కూడా నింపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇవి స్థానిక కాలమానం ప్రకారం.. ఈ శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు ఎత్తివేత.. ఏప్రిల్‌లో జరిగే ఈస్టర్ వేడుకలకు దోహదపడతుందని అధికారులు తెపారు.
ఎత్తివేసిన ఆంక్షలివే..
- శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి బ్రిటన్‌కు వెళ్లినవారు ఇకపై ప్రయాణ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
- టీకా తీసుకోకపోయినా.. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోనవసరం లేదు.
- టీకాలు వేయని ప్రయాణీకులకు ప్రీ-డిపార్చర్ టెస్ట్, వచ్చిన రెండు రోజుల తర్వాత మరొక పరీక్ష చేసుకోవాలన్న నిబంధనను ఎత్తివేశారు.
ఇదీ చూడండి: వేల కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌లు.. చైనాలో ఏం జరుగుతోంది?