భారత ప్రభుత్వం ఆర్థిక సాయమందించగా.. నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని చారిత్రక సెటో మచీంద్రనాథ్ దేవాలయ పునురద్ధరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి.
2017లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. నేపాల్లోని 28 వారసత్వ ప్రదేశాల పునర్నిర్మాణం కోసం రూ.580 కోట్లను అందిస్తామని భారత్ హామీ ఇచ్చింది. ఈ మేరకు అందిన నిధులతో సేటో మచీంద్రనాథ్ ఆలయ పునురుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. నేపాల్లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, నేపాల్ జాతీయ పునర్నిర్మాణ అథారిటీ సీఈఓ సుశీల్ గ్యవాలి, కాఠ్మాండూ మెట్రోపాలిటన్ మేయర్ బిడియా సుందర్ శాక్య ఆదివారం ఈ పనులకు 'భూమి పూజ' నిర్వహించారు.
నేపాల్ ప్రభుత్వం ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఈ పునరుద్ధరణ పనులకు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్(ఐఎన్టీఏసీహెచ్) సాంకేతిక సహకారం అందిస్తోంది. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ సెటో మచీంద్రనాథ్ ఆలయం.. 2015 ఏప్రిల్‌లో సంభవించిన భూకంపంలో దెబ్బతింది. సెటో మచీంద్రనాథ్ను బౌద్ధులు, హిందువులు పూజిస్తారు.
ఇదీ చదవండి:17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్