Russia Ukraine War: ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరతానని పట్టుబట్టడమే ప్రస్తుత యుద్ధానికి కారణంగా మారింది. ఆ కూటమిలో ఉక్రెయిన్ చేర్చుకోమని హామీ ఇవ్వాలంటూ అమెరికా, నాటోపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. అసలు నాటో అంటే రష్యాకు ఎందకంత ద్వేషం. ఆ కూటమి దళాలు తమ సరిహద్దుల్లోకి చేరతాయంటే పుతిన్ ససేమీరా అంగీకరించడంలేదు. దీనికి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి జరిగిన పలు పరిణామాలు కారణంగా నిలిచాయి.
Russia Ukraine Crisis
1939-45 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం గెలిచాక తూర్పు యూరప్‌లోని చాలా ప్రాంతాల నుంచి సోవియట్ సేనలు వైదొలగేందుకు నిరాకరించాయి. 1948లో బెర్లిన్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో సోవియట్‌ను కట్టడి చేయడానికి కూటమిగా ఏర్పడాలని 12 దేశాలు భావించాయి. 1949లో ఇది కార్యరూపం దాల్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, ది నెదర్లాండ్స్, ఐస్‌ల్యాండ్, బెల్జియం, లక్సమ్‌బర్గ్, నార్వే, పోర్చుగల్, డెన్మార్క్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు నాటో దాదాపు 30 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అది 30 సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అన్ని దేశాలు ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతాయి.
సోవియట్ దేశాలకు సభ్యత్వం ఇవ్వడం..
1991 డిసెంబర్ 25న సోవియట్ పతనమైంది. మొత్తం 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. రష్యా, అర్మేనియా, అజర్‌బైజన్, బెలారస్, ఎస్తోనియా, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, లాత్వియా, లిథువేనియా, మాల్డోవా, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్ వీటిల్లో ఉన్నాయి. దీంతో ప్రపంచంలో అమెరికా ఒక్కటే సూపర్ పవర్‌గా నిలిచింది. దాని నేతృత్వంలోని నాటో కూటమి వేగంగా సభ్యదేశాలను పెంచుకొంటూ విస్తరించింది. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా 2004లో నాటోలో చేరాయి. 2008లో ఉక్రెయిన్, జార్జియాలకు నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పినా తీసుకోలేదు. నాటో విస్తరణపై పుతిన్ అభ్యంతరం తెలిపారు.
Russia declares war on Ukraine
రష్యా వర్సెస్ నాటో..
నాటో సైనికశక్తితో రష్యాను ఏమాత్రం పోల్చలేని పరిస్థితి. నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్ 1,106 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోపక్క 2020లో రష్యా సైన్యంపై కేవలం 61.7 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చుపెట్టింది. దాదాపు 40 వేల నాటో సైనికులు రష్యన్లతో పోరాడేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో నాటో సభ్యదేశాల సైనికుల సంఖ్య 33 లక్షలు.. రష్యా వద్ద కేవలం 12 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వీరిలో 8లక్షల మంది యాక్టివ్ దళాలు.
పుతిన్ ఏమి కోరుకుంటున్నారు..
తూర్పు ఐరోపాలో నాటో విస్తరణను ఆపేయాలని పుతిన్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి నాటో నుంచి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. 1997 ముందు నాటి స్థితికి నాటో దళాలు వెళ్లాలని చెబుతున్నారు. దీంతోపాటు గతంలో వార్సోపాక్ట్ ఒప్పందంలో భాగస్వాములైన 14 దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వడంపై కూడా అభ్యంతరం చెబుతున్నారు.
Russia Ukraine War Crisis
నాటోలో చేరాలని ఉక్రెయిన్‌కు ఎందుకు కోరుకొంది..?
ఉక్రెయిన్‌లో తూర్పుప్రాంతం, పశ్చమ ప్రాంతం ప్రధానమైనవి. వీటిల్లో తూర్పు ప్రాంతంలో ఉండేవారు రష్యాతో సన్నిహితంగా ఉండాలని కోరుకొంటారు. ఇక పశ్చిమ ప్రాంతంలో ఉండేవారు ఐరోపా సమాఖ్యతో కలవాలనుకొంటారు. ఈ నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటు వాదులకు రష్యా మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో 2014లో క్రిమియాను ఆక్రమించుకోవడంతో పాటు తాజాగా తూర్పు ప్రాంతంలోని దొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించింది. రష్యా రక్షణ బడ్జెట్ ఉక్రెయిన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే 10 రెట్లు పెద్దది. ఉక్రెయిన్ సైన్యం కంటే రష్యా దళాల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే సైనిక రక్షణ లభిస్తుందని ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం కోరుతోంది. చివరికి ఆ కోరికే ఉక్రెయిన్‌పై దాడికి కారణమైంది.
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి- యుద్ధంలో 100 మందికిపైగా మృతి!