చైనా సహా మరో మూడు ఆసియా దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అంటువ్యాధులు, వైరస్ గురించి చర్చించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బుధవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
జెనీవా వేదికగా జరిగే ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ.. ఈ వైరస్ ప్రభావం కారణంగా.. ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలా వద్దా అని నిర్ణయించనుంది. అతి పెద్ద అంటువ్యాధులను మాత్రమే ఇలా పరిగణిస్తారు.
కరోనా వైరస్‌గా పిలిచే ఈ అంటువ్యాధిని మొదటిసారి చైనా, హాంకాంగ్ భూభాగాల్లో గుర్తించారు. ఇది 'సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్' (సార్స్) వైరస్ లక్షణాలు కలిగి ఉన్నట్లు నిపుణులు తెలిపారు. 2003లో ఈ వైరస్ కారణంగా సుమారు 650 మంది మరణించారు. ప్రస్తుతం సుమారు 208 మంది ఈ కొత్త వైరస్‌తో బాధపడుతున్నారు.
కొత్త కేసుల కలకలం
బీజింగ్, షాంఘై ప్రాంతాల్లో సోమవారం ఈ కరోనా వైరస్ లక్షణాలున్న కేసులను గుర్తించారు. దక్షిణ గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇక వుహాన్‌లో వారాంతంలో 136 కొత్త కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వుహాన్‌లోని సీ ఫుడ్ మార్కెట్‌ను.. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
వైద్యులకూ వ్యాప్తి
ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. గ్వాంగ్ డాంగ్, వుహాన్‌ను సందర్శించిన కుటుంబంలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. రోగులకు సాయం చేస్తోన్న 14 మంది వైద్య సిబ్బందికీ ఈ వ్యాధి సోకినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన వాటిలో 95కు పైగా కేసులు వుహాన్‌కు చెందినవేనని పేర్కొన్నారు.
బీజింగ్‌లో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మొదటి కేసు బయటపడింది. థాయ్‌లాండ్, జపాన్ దేశాల్లోనూ మూడు కేసులు నమోదు కాగా.. వారంతా చైనాలోని వుహన్ ప్రాంతాన్ని సందర్శించన వారే కావడం గమనార్హం. వూహాన్లో 170 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 9మంది పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం