"తాలిబన్ల నుంచి విముక్తి పొందాలి.. ఎలాగైనా దేశాన్ని విడిచివెళ్లిపోవాలి.." లక్షలాది మంది అఫ్గాన్ ప్రజల ఆలోచన ఇదే. ఇందుకోసం కొందరు కట్టుబట్టలతో విమానాశ్రయాలకు పరుగులు తీస్తుంటే.. మరికొందరు మూటలు నెత్తిమీద వేసుకుని.. దేశ సరిహద్దులను కాలినడకన దాటేస్తున్నారు. కాబుల్‌ను తాలిబన్లు(Taliban news) ఆక్రమించినప్పటి నుంచి ఆ దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తున్నాయి. ప్రజల ఆర్థనాథాలు.. ప్రపంచ దేశాలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కానీ ప్రజలు దేశాన్ని దాటడం ఒకెత్తు.. వెళ్లిన ప్రాంతంలో జీవించడం మరో ఎత్తు! ఎందుకంటే వారికి శరణార్థులుగా(Afghan refugees) గుర్తిస్తారు. అయితే అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. తగిన విధంగా సహాయం చేస్తామని హామీనిచ్చాయి. మరికొన్ని దేశాలు మాత్రం వారికి దూరంగా ఉంటున్నాయి. ఆ వివరాలు ఇలా..
![Afghan refugees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12846017_2.jpg)
శరణార్థులు అంటే ఎవరు?
"యుద్ధం, అశాంతి కారణంగా బలవంతంగా సొంత దేశాన్ని వీడిన వారు" శరణార్థులు అని నిర్వచనమిచ్చింది యూఎన్‌హెచ్‌సీఆర్(యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్).
దీని ప్రకారం ప్రపంచ శరణార్థుల్లోని 68 శాతం సిరియా, వెనుజువెలా, అఫ్గానిస్థాన్, దక్షిణ సుడాన్, మయన్మార్ నుంచి వలస వెళ్లినవారేనని యూఎన్‌హెచ్‌సీఆర్(unhcr Afghan refugees) డేటా చెబుతోంది. 2020 నాటికి 28 లక్షల మంది అఫ్గాన్ ప్రజలు శరణార్థుల జాబితాలో చేరారు. ఇందులో 90 శాతం మంది ఇరాన్, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
ఏ దేశంలో ఎలా...?
తాజా పరిణామాలతో.. అఫ్గాన్ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. తమ వంత సహాయం చేస్తున్నాయి.
అమెరికా..
గత కొన్ని రోజులుగా దాదాపు 1,200మంది అఫ్గాన్‌వాసులను(Afghan refugees in US) అక్కడి నుంచి తరలించింది అమెరికా. రానున్న రోజుల్లో ఆ సంఖ్య 3,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో కొంతమందికి వసతులు కల్పించేందుకు కూడా అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యూఎస్ రెఫ్యూజీ అడ్మిషన్స్ ప్రొగ్రాం(యూఎస్ఆర్ఏపీ)ను వినియోగించుకోనుంది.
మొత్తం మీద 10వేల మంది అఫ్గాన్ ప్రజలను రక్షించేందుకు అగ్రరాజ్యం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
![Afghan refugees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12846017_5.jpg)
కెనడా..
20,000 అఫ్గాన్వాసులకు ఆశ్రయమివ్వనున్నట్టు కెనడా ప్రకటించింది. ఈ సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
యూకే..
5వేల మంది అఫ్గాన్లను స్వాగతిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నూతన పునరావాస కార్యక్రమంలో భాగంగా పిల్లలు, ఆడవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది.
![Afghan refugees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12846017_3.jpg)
భారత్..
శరణార్థుల విషయంలో భారత దేశం ఎలాంటి విధానాలను అనుసరించడం లేదు. ఇన్నేళ్లు.. వేర్వేరు దేశాల్లోని సంక్షోభ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని, చర్యలు చేపట్టింది. కానీ ప్రత్యేక వ్యవస్థ లేదు.
అయితే అఫ్గాన్‌లో(Afghan refugees in India) తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం ఈ-వీసాలను ప్రవేశపెట్టింది. దేశంలోకి వారు అడుగుపెట్టే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.
పాకిస్థాన్..
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమిస్తే.. తమ సరిహద్దులను మూసివేస్తామని ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటించారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కానీ తాజాగా అలాంటి నిర్ణయాలేవీ ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకోలేదు. ఫలితంగా సరిహద్దుల్లో భారీ ప్రవాహం కనపడుతోంది. కాలి నడకన ప్రజలు సరిహద్దులను దాటుతున్నారు.
![Afghan refugees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12846017_6.jpg)
ఈ నేపథ్యంలో వలస వస్తున్న వారి కోసం తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా సమగ్ర వ్యూహాల రచిస్తున్నట్టు పాక్(Afghan refugees in Pakistan) వెల్లడించింది.
ఇరాన్..
అఫ్గాన్ వలసదారులకు ఆశ్రయమిచ్చేందుకు మూడు రాష్ట్రాల్లో తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది ఇరాన్. అయితే.. అఫ్గాన్‌ను వీడి తమ దేశంలోని వచ్చే ప్రజలను.. అక్కడ పరిస్థితులు చక్కబడిన వెంటనే పంపేస్తామని తేల్చిచెప్పింది.
ఉజ్బెకిస్థాన్..
అఫ్గాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా.. తమకు ఏదీ పట్టనట్టుగా ప్రవర్తిస్తోంది పొరుగు దేశం ఉజ్బెకిస్థాన్. కరోనా అని కారణంగా చెబుతూ.. మూసివేసిన సరిహద్దును ఇంకా తెరవలేదు. అఫ్గాన్ ప్రజలు వీసాలు దాఖలు చేసినా.. అవి తిరస్కరణకే గురవుతున్నాయి.
టర్కీ..
టర్కీలోనూ పరిస్థితులు భిన్నంగా లేవు. వలసదారులను అడ్డుకునేందుకు టర్కీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే.. సరిహద్దు ప్రాంతమైన వాన్లో.. అఫ్గాన్ ప్రజలను నిర్బంధించింది.
అమెరికా అభ్యర్థన మేరకు.. తమ దేశంలోకి అఫ్గాన్ ప్రజలను తగిన సంఖ్యల్లో అనుమతిచ్చేందుకు ఉత్తర మెకడొనియా, ఉగాండా, అల్బెనియా-కొసొవా అంగీకరించాయి.
![Afghan refugees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12846017_1.jpg)
ఇదీ చూడండి:- Afghan crisis :మా పిల్లల్ని కాపాడండి.. కంచెల పైనుంచి విసిరేస్తున్న మహిళలు