దాదాపు 20 వేల సంవత్సరాల క్రితం నాటి ఓ ఖడ్గమృగం మృతదేహం రష్యాలో బయటపడింది. దాని అవయవాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.
ఉత్తర రష్యా సైబీరియాలోని యాకుతియా ప్రాంతపు మంచునేలల్లో ఈ ఖడ్గమృగ కళేబరం ఆగస్టులో బయటపడిందని రష్యా మీడియా బుధవారం వెల్లడించింది. అయితే.. ఇప్పటి వరకు మంచులో బయటపడ్డ జంతువుల మృతదేహాల్లో ఇదే అత్యంత భద్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాని ప్రేగులు, వెంట్రుకలు, శరీర అవయవాలు, కొవ్వు ఇప్పటికీ పాడవకుండా ఉన్నట్లు చెప్పారు.
ఈ ఖడ్గమృగం చనిపోయేనాటికి దాని వయస్సు 3 నుంచి 4 ఏళ్ల మధ్య ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన పురాతన జంతుశాస్త్ర అధికారి వాలెరీ ప్లాట్నికోవ్ తెలిపారు. ఇది దాదాపు 20,000 నుంచి 50,000 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రేడియోకార్బన్ అధ్యయనం అనంతరమే దీని కచ్చితమైన వయస్సును గుర్తించగలమని తెలిపారు.
ఖడ్గ మృగాలు, గుర్రపు పిల్లలు, సింహపు పిల్లల మృతదేహాలు మంచులో గత కొన్నేళ్లుగా ఎన్నో లభ్యమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరగడం వల్లే సైబీరియా అక్కడి నేలల్లో ఇవి బయటపడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 2014లో కూడా రష్యాలో ఓ ఖడ్గమృగ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ కళేబరం 34,000 ఏళ్లు నాటిదని గుర్తించారు.
ఇదీ చూడండి:కొత్త రూల్- చిన్న పిల్లలకు కేక్, ఐస్‌క్రీమ్ బంద్!