భారత్ తప్పుడు చర్యలను వెంటనే సరిదిద్దుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెంబిన్ అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ వెంటనే స్పష్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో మాట్లాడిన తరువాత వెంబిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పత్రిక తెలిపింది.
"ఇటీవలి ఘర్షణలకు చైనా బాధ్యత లేదు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించింది భారతే. సరిహద్దుల్లో యథాతథ స్థితిని భారతదేశం ఏకపక్షంగా ఉల్లంఘించింది. సరిహద్దు దాటి వచ్చి కాల్పులు జరిపి చైనా భద్రతా దళాల రక్షణను ప్రమాదంలో పడేసింది.
ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నా. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. రెండు దేశాలు ఉమ్మడిగా సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసేందుకు వీలుగా చైనా ఎప్పుడూ దౌత్య, సైనిక పరమైన చర్చలకు సిద్ధంగా ఉంటుంది."
- వాంగ్ వెంబిన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
రాజ్‌నాథ్ ప్రకటన..
సరిహద్దుల నిర్ణయానికి డ్రాగన్ దేశం ఒప్పుకోవడం లేదని పార్లమెంటులో రాజ్‌నాథ్ ప్రకటన చేశారు. ఇప్పటివరకు చైనా మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని వెల్లడించారు. చైనా కుట్రలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిందని తెలిపారు.
"1993, 1996 ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడింది. ఆగస్టులో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. డ్రాగన్ దేశం దుశ్చర్యలను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దులో బలగాలను మరింత పెంచాం."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఇదీ చూడండి: సరిహద్దులో భారత్ దేనికైనా రె'ఢీ': రాజ్‌నాథ్