ప్రపంచంపై కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు వేల మంది బాధితులుగా మార్చుకుంటోంది ఈ మహమ్మారి. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 92 లక్షల మందికి పైగా వైరస్ బాధితులయ్యారు. మరణాలు 4 లక్షల 75 వేలు దాటాయి. అయితే రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ఇప్పటివరకు కోలుకున్నారు.
రష్యాలో కొత్తగా 7,425 కేసులు..
రష్యాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా మరో 7,425 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా కేసుల సంఖ్య 6 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 5,99,705 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 153 మంది మహమ్మారి సోకి మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 8,359కి చేరింది.
పాక్‌లో తీవ్రం..
పాకిస్థాన్‌లో కరోనా కేసులు, మరణాలు అధిమవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 3,695 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మొత్తం కేసుల సంఖ్య 1,85,034కు చేరింది. మరో 105 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు 3,695 మంది వైరస్‌కు బలయ్యారు.
10 వేలకు పైగా..
నేపాల్లోనూ కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో 538 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటివరకు 10 వేల 99 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో కరోనాతో 24 మంది మరణించారు.
- సింగపూర్‌లో గడచిన 24 గంటల్లో 119 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
- చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా మరో 29 కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో బీజింగ్ నుంచే 13 మంది ఉన్నట్లు వెల్లడించారు. బీజింగ్‌లో రెస్టారెంట్లు, పాఠశాలలపై మళ్లీ ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొన్నారు.
- జర్మనీలో కేసులు పెరుగుతున్న కారణంగా ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని, బయట వ్యక్తులను కలవకూడదని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్ర గవర్నర్ అర్మిన్ లాస్చెట్ ఆదేశించారు.
- దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. మొత్తం బాధితుల సంఖ్య లక్ష దాటినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు.
- కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నా.. లాక్‌డౌన్‌ను సడలించే దిశగా అడుగులు వేస్తున్నాయి అనేక దేశాలు. జులై 4 నుంచి సినిమా హాళ్లు, మ్యూజియాలు, బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభం కానున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అమెరికా, పశ్చిమ యూరప్, పాకిస్థాన్, మెక్సికో, కొలంబియా, ఇండోనేసియా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలించనున్నాయి.