ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతాపం విధ్వంసకరంగా మారుతోంది. ప్రాణాంతక వైరస్ ధాటికి ప్రజలెవ్వరూ బయటకు రాని పరిస్థితి నెలకొంది. వివిధ దేశాల్లో విధించిన ఆంక్షల కారణంగా వంద కోట్ల మందికి పైగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 35 దేశాల్లో నిర్బంధం కొనసాగుతోంది. అత్యవసర చర్యలు చేపట్టి సరిహద్దులు మూసివేయడం వల్ల వందల కోట్ల మందిపై ప్రభావం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13 వేలు దాటింది.
- ఇటలీలో ఈ మహమ్మారి అంతకంతకూ తీవ్రమవుతోంది. 4,800 మందికి పైగా వైరస్ కారణంగా మృతి చెందారు. మరణాల రేటు 8.6 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
- అమెరికాలోని న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెలిస్ రాష్ట్రాలు నిర్బంధంలో ఉన్నాయి. మరిన్ని రాష్ట్రాలకు ఈ నిర్బంధం వర్తింపజేసే ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
- స్పెయిన్‌లో కరోనా మరణాల సంఖ్య నిన్నటితో పోలిస్తే 30శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో 394 మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. మొత్తం మృతుల సంఖ్య 1,720కి చేరినట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అత్యంత కఠిన పరిస్థితులకు ప్రజలు సన్నద్ధం కావాలని ఆ దేశ అధ్యక్షుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
- ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య 562కు చేరింది. ప్రజలను ఇళ్లలోనే ఉంచేందుకు హెలికాఫ్టర్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
- ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ సహా ఇతర ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించాయి. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించేందుకు వెనకాడబోమని స్పష్టం చేశాయి.
ఆసియా...
కరోనా ప్రభావంతో ఆసియా దేశాల్లోనూ బంద్ వాతావరణం నెలకొంది. పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కట్టుదిట్టమైన నిబంధనలను సక్రమంగా అమలు చేసేందుకు మలేసియా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.
- థాయ్‌లాండ్‌లో రాత్రికిరాత్రి మూడో వంతు అధికంగా కేసులు నమోదయ్యాయి. 600 మందికి పైగా వైరస్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది.
- దేశంలో 300కు పైగా కేసులు నమోదైనందున.. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
- వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన పలు దేశాల్లో మళ్లీ తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. విదేశాల నుంచి వచ్చే వారిని పరీక్షిస్తున్నారు.
- సింగపూర్, హాంకాంగ్‌లో ఆంక్షలు కఠినతరం చేశారు. ప్రయాణాలను నిషేధిస్తున్నారు. ఇతర దేశాల్లోని హాంకాంగ్ ప్రజలు స్వదేశానికి తిరిగివస్తున్న కారణంగా... రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
- ఇరాన్లో కరోనా వైరస్ బారిన పడి మరో 129 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 1,685కి చేరుకుంది. 21,638 కొవిడ్ కేసులను నిర్ధరించారు.
ఆర్థికాన్ని ఆదుకునేందుకు ఆస్ట్రేలియా
వైరస్ కారణంగా నష్టపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆస్ట్రేలియా నడుం బిగించింది. 38 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. చిరు వ్యాపారులు, లాభాపేక్షలేని సంస్థలకు సబ్సిడీ ఇచ్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దీని ద్వారా ఒక్కో వ్యాపార సంస్థకు లక్ష ఆస్ట్రేలియన్ డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుంది. మరోవైపు నిరుద్యోగ భృతి తాత్కాలికంగా రెట్టింపు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కరోనా ప్రభావంతో 29 ఏళ్ల తర్వాత ఆర్థిక వృద్ధి తిరోగమనంలో పడిపోయినందున ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
వైరస్ వ్యాప్తి నిరోధించడానికి దేశీయంగా ప్రజలు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే దేశ సరిహద్దులు మూసేయగా... వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలో 1,300కు పైగా కరోనా కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు.