చైనాలోని వుహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ హాంకాంగ్‌లోనూ పంజా విసురుతోంది. చైనాకు సమీపంలో ఉన్న హాంకాంగ్‌లో ఇప్పటివరకు 67 కేసులు నమోదు కాగా.. ఇద్దరు మరణించారు. ఈ క్రమంలో వైరస్‌నుంచి రక్షణ పొందేందుకు మాస్క్‌ల వినియోగం ఎక్కువైంది. డిమాండ్ పెరగడం వల్ల వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చౌక ధరకు మాస్క్‌లను తయారు చేసేందుకు ముందుకొచ్చింది ది నాన్సెన్స్ మేకర్స్ అనే థియేటర్ గ్రూప్.
ది నాన్సెన్స్ మేకర్స్‌కు చెందిన వాలంటీర్లు పత్తితో చేసిన పునర్వినియోగ మాస్క్‌లను చేసి అందిస్తున్నారు. గ్రూప్ వ్యవస్థాపకులు జో నగై, ఆమె స్నేహితురాలు జెస్సీ హాన్ థియేటర్ రిహార్సల్ గదిలో తాత్కాలిక కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకొని మాస్క్‌లను తయారు చేస్తున్నారు. ఈ మాస్క్‌ల తయారీకి అందరికి అందుబాటులో ఉండే పత్తి, వస్త్రాలను వినియోగిస్తున్నారు.
మూడు పొరలు..
పత్తితో తయారు చేసిన మాస్క్‌లు మూడు పొరలను కలిగి ఉంటాయి. బయట ఉండే పొర పత్తితోనూ, మధ్యలో ఉండేది నీటిని పీల్చే స్వభావం కలిగి ఉంటుంది. లోపల ఉండే పొర శ్వాస తీసుకోవడానికి సులభంగా ఉండేలా, తేమను పీల్చుకునేలా ఉంటుంది. వినియోగదారులు మరింత రక్షణ కోరుకుంటే.. దీన్ని రెండుగా చేసి మధ్యలో శస్త్రచికిత్సలకు వాడే మాస్క్‌లు ఉంచుకోవచ్చు. ఈ మాస్క్‌ను శుభ్రపరిచి తిరిగి వాడొచ్చు.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అధికం కావడం వల్ల మాస్క్‌ల వినియోగం పెరిగింది. దీంతో మాస్క్‌ల ఉత్పత్తి తక్కువై, డిమాండ్ పెరిగి ధర మూడింతలు అధికమైంది. సాధారణ ప్రజలకు ఇవి కొనుగోలు చేయాలంటే భారంగా మారింది. ఈ నేపథ్యంలో రోజుకు 400 వరకు పత్తి మాస్క్‌లను ఉత్పత్తి చేయాలని ది నాన్సెన్స్ మేకర్స్ నిర్వాహకులు భావిస్తున్నప్పటికీ తయారీకి అధిక సమయం తీసుకోవడం వల్ల అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికే హాంకాంగ్‌లోని ఎన్జీఓ సంస్థలకు కొన్నింటిని పంపిణీ చేశారు. ఎన్జీఓల సహాయంతో త్వరలోనే పేద ప్రజలకు అందించనున్నారు.
" శస్త్ర చికిత్సల మాస్క్‌ల కంటే కాటన్ వస్త్రం, పత్తితో తయారు చేసిన ఈ మాస్క్‌లు ఎంతో మంచివి. ముందు జాగ్రత్తగా వీటిని ధరించడం మంచి ఆలోచనే. ఈ మాస్క్ల్లో మధ్యలో శస్త్ర చికిత్సలకు ఉపయోగించే మాస్క్‌ను ఉంచడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సహాయపడుతుంది. ఈ మాస్క్ తేమను గ్రహించే లక్షణం కలిగి ఉన్నందున ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఈ మాస్క్‌ల తయారీ చాలా మంచి ఆలోచన."
- డాక్టర్ జోసెఫ్ త్సాంగ్, అంటువ్యాధుల నిపుణుడు
పత్తితో చేసిన ఈ మాస్క్‌లను వైద్య సిబ్బందికి అందించాలని నిర్ణయించుకున్నామని ది నాన్సెన్స్ మేకర్స్ వ్యవస్థాపకురాలు జో నగై తెలిపారు. హాంకాంగ్ ప్రజలకు వైరస్ సోకకుండా తీవ్ర కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బందికి కూడా వీటి అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంతో రక్షణతో కూడిన ఈ మాస్క్‌లను వారికి అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ది నాన్సెన్స్ మేకర్స్ నిర్వాహకులు.
ఇదీ చదవండి: కరోనా భూతం: చైనాలో మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య