కరోనా తీవ్రత పెరిగితే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. దీని వల్ల వారి మెదడు, కాలేయం, ఇతర అవయవాలకు అవసరమైన ఆక్సిజన్‌ను రక్తం సరఫరా చేయలేకపోతుంది. వెరసి రోగి మృత్యువాత పడటం ఖాయం. ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు చికిత్సలు అందించే క్రమంలో 'ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంవో)' యంత్రం ప్రాణాధారం కాగలదని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు.
వయో వృద్ధులకు, అంతకుముందే ప్రమాదకర వ్యాధులు ఉన్న వారికి, గుండె పనితీరు క్షీణించిన వారికి ఈ యంత్రంతో తక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. రోగి రక్తాన్ని ఈసీఎంవో యంత్రంలోకి పంపి, అక్కడ ఆక్సిజన్‌ను మిళితం చేసి, ఆ రక్తాన్ని మళ్లీ శరీరంలోకి పంపుతారు. దీని వల్ల రోగి ఊపిరితిత్తులు, కొన్నిసార్లు గుండెకు కొంత సమయం విశ్రాంతి లభించి, కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.
వెంటిలేటర్ల ద్వారా అందించే చికిత్స సరిపోనప్పుడు ఈసీఎంవో యంత్రాలను వినియోగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. కరోనా వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగించి, మృత్యువుతో పోరాడుతున్న 32 మందికి ఈసీఎంవో యంత్రం ద్వారా చికిత్స చేస్తే 22 మందికి ప్రాణాపాయం తప్పిందని, 5 పూర్తిగా కోలుకున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి:జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!