కాబుల్ విమానాశ్రయం(Kabul airport) సమీపంలో రానున్న 36 గంటల్లో మరోసారి పేలుళ్లు(Kabul airport blasts) సంభవించే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. వీలైనంత త్వరగా విమానాశ్రయం పరిసర ప్రాంతాల నుంచి తరలి వెళ్లాలని తమ పౌరులను కోరింది.
విమానాశ్రయానికి రావొద్దని, ఎయిర్పోర్ట్ అన్ని ద్వారాల వద్ద నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది అమెరికా విదేశాంగ శాఖ. ముఖ్యంగా దక్షిణ ద్వారం(ఎయిర్పోర్ట్ సర్కిల్), పంజ్‌షేర్ పెట్రోల్ స్టేషన్ గేట్‌కు సమీపంలో పేలుళ్లు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందనే సమచారం అందినట్లు పేర్కొంది.
చివరివి కావు..
అఫ్గానిస్థాన్‌లోని(Afghanistan Taliban) ఇస్లామిక్ స్టేట్స్ స్థావరాలపై శనివారం జరిపిన డ్రోన్ దాడులు చివరివి కావని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడిలో తమ పౌరుల ప్రాణాలు బలిగొన్నవారిలో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. శనివారం ఐసిస్-కే ఉగ్రసంస్థ స్థావరాలపై డ్రోన్ దాడి జరిపిన అమెరికన్ దళాలు ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. అంతకుముందు కాబుల్ విమానాశ్రయంలో ఐసిస్ జరిపిన దాడుల్లో 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.
ఇదీ చూడండి: Afghanistan Taliban: తాలిబన్ల గుప్పిట్లోకి కాబుల్ విమానాశ్రయం