కొన్ని రోజులుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు సంబంధించిన వార్తలు ఏవీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని తెలుస్తోంది.
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలను అమెరికా నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే ఉత్తర కొరియాలో ఎటువంటి అనుమానాస్పద చర్యలను గుర్తించలేదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం బ్లూ హౌస్ పేర్కొంది.
ప్రస్తుతం కిమ్ ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని బ్లూ హౌస్ తెలిపింది. అయితే కిమ్ ఆరోగ్యంపై వస్తోన్న కథనాలు వాస్తవమేనని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతంలో రాజధాని ప్యాంగ్యాంగ్లో కిమ్.. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తా సంస్థ ప్రచురించింది.
ఏప్రిల్ 15న ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాతైన కిమ్ ఇల్ సుంగ్ జయంతి వేడుకలకు ఏటా హాజరయ్యే కిమ్.. ఈ సారి రాకపోవడం వల్ల ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 11న మీడియా ముందుకు వచ్చారు. దేశంలో వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.