ఆగస్టు 31.. ఇప్పుడు అందరి కన్నూ ఈ తేదీపైనే ఉంది. అమెరికా నుంచి అఫ్గానిస్థాన్ వరకు అన్ని దేశాలూ ఆ రోజు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తున్నాయి. అఫ్గాన్ నుంచి అమెరికా సహా నాటో కూటమి సైన్యం ఉపసంహరణ(US troop withdrawal)కు చివరి రోజు అదే. డెడ్‌లైన్ దాటిన తర్వాత కూడా అఫ్గాన్‌లోని తమ పౌరులను, తమకు సహకరించిన వారిని తీసుకొచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే తాలిబన్లు తీవ్ర హెచ్చరికలు(Taliban warning to US) చేశారు. ఆగస్టు 31 తేదీనే డెడ్‌లైన్ అని.. అదే వారికి 'రెడ్‌లైన్' అని తేల్చి చెప్పారు. 'రెడ్‌లైన్' దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మరి.. అమెరికా ప్రణాళికలు ఏంటి?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కూడా రెడ్‌లైన్ దాటేలా కనిపించడం లేదు. ఆగస్టు 31 గడువులోపే అమెరికా పౌరులను అక్కడి నుంచి తరలించాలని చూస్తోంది. అయితే, చాలా ఏళ్లుగా తమకు అండగా ఉన్న అఫ్గాన్ వాసులకు సాయపడేందుకు ఎలాంటి గడువు లేదని మెలిక పెట్టింది.
డెడ్‌లైన్ ప్రకారం చూసుకుంటే.. అమెరికా సహా మిత్ర దేశాలకు ఐదు రోజులే గడువు ఉంది. ఆలోపే అఫ్గానిస్థాన్‌లోని తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. సైన్యం ఉన్నప్పుడే.. అక్కడ ఉంటున్న తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చేయాలని దేశాలు భావిస్తున్నాయి.
తరలింపు ప్రక్రియ ఎలా సాగుతోంది?
డెడ్‌లైన్(Troops withdrawal deadline) పొడిగించాలని అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్(UK PM Boris) జాన్సన్ సహా పలు ఐరోపా దేశాల నేతలు ఇదే విషయంపై ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి(US secretary of state) ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) తాజాగా ప్రకటించినా... దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
దీంతో ఆగస్టు 31 డెడ్‌లైన్(august 31 deadline)ను దృష్టిలో పెట్టుకొని పౌరుల తరలింపు ప్రక్రియను ఆయా దేశాలు ముమ్మరం చేశాయి. ఆగమేఘాల మీద ప్రజలను దేశం దాటిస్తున్నాయి. అమెరికా ఇప్పటి వరకు 82 వేల మందిని సురక్షితంగా ఆ దేశం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇందులో 19 వేల మందిని బుధవారం ఒక్కరోజే తీసుకురావడాన్ని గమనిస్తే.. తరలింపు ప్రక్రియను అమెరికా ఎంత వేగవంతం చేసిందనే విషయం స్పష్టమవుతోంది.
ఎలా తరలిస్తోంది?
ప్రజలను కాబుల్ నుంచి బయటకు తీసుకురావడం క్లిష్టమైన తరలింపు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. తొలుత ప్రజలను అమెరికా ఆర్మీ తన విమానాల్లో ఖతర్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాల్లోని స్థావరాలకు తరలిస్తోంది. అక్కడి నుంచి వాణిజ్య విమానాలు ఏర్పాటు చేసి.. వీరిని పంపిస్తోంది. ఇందుకోసం ఆరు ఎయిర్లైన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి.. సేవలు అందించాలని అమెరికా రక్షణ శాఖ ఆదేశించింది.
తరలింపు ప్రక్రియకు ఇబ్బందులు
పెద్ద ఎత్తున ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి చేరుకుంటుండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అర్హులు కాకపోయినా.. అనేక మంది రీలొకేషన్ కోసం అభ్యర్థన చేసుకుంటున్నారు. దీంతో తరలింపు ప్రక్రియ కష్టతరమవుతోందని కాబుల్‌లోని అమెరికా ఎంబసీ పేర్కొంది. విమానాశ్రయానికి వచ్చినవారు వెనక్కి తిరిగివెళ్లకపోవడం, దీనికి తోడు అదనంగా ప్రజలు తరలి రావడం వల్ల.. కాబుల్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. దాడికి పథక రచన జరుగుతోందన్న హెచ్చరికలను సైతం పట్టించుకోవడం లేదు. దేశాన్ని విడిచి వెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ఐసిస్ ముప్పు
కాబుల్ విమానాశ్రయాని(Kabul airport)కి ఐసిస్ దాడుల ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరికలు అందుతున్నాయి. విమానాశ్రయం వెలుపల దాడులకు(Kabul airport attack) ఆస్కారం ఉందని అమెరికా నిఘా వర్గాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సైతం హెచ్చరిక ప్రకటనలు చేశాయి.
ఇదీ చదవండి: కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ దాడికి కుట్ర!
రాజధానిని హస్తగతం చేసుకోగానే.. వేలాది మంది ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాదులను తాలిబన్లు జైళ్ల నుంచి విడుదల చేశారు. వీరు అమెరికా సైన్యంపై ప్రతీకార దాడులకు తెగబడొచ్చని అనుమానిస్తున్నారు. కాబట్టి అమెరికా ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అఫ్గాన్‌లో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత కొద్దిరోజులకు వ్యతిరేక దళాలు తిరుగుబాటు చేశాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు తలెత్తుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. బఘ్లాన్ రాష్ట్రంలో భీకర యుద్ధం జరిగిందని తెలిపింది. అయితే, ఇక్కడి తాలిబన్ వ్యతిరేక దళాలు.. అంతర్యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రభుత్వంలో భాగం కావాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు, తాలిబన్ల అధీనంలో లేని ఏకైక ప్రాంతమైన పంజ్‌షేర్‌లో పరిస్థితులు వాడీవేడిగా ఉన్నాయి. అనేక మంది తాలిబన్ ఫైటర్లు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది?
దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు పావులు కదుపుతున్నారు. అంతర్యుద్ధం తలెత్తకుండా పలువురు నేతలతో చర్చలు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ముఖ్యనేత అబ్దుల్లా అబ్దుల్లా సహా ఎనిమిది మంది కీలక నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారిలో పంజ్‌షేర్ యువనేత అహ్మద్ మసూద్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా బలగాలు పూర్తిస్థాయిలో వైదొలిగాకే ప్రభుత్వం ఏర్పాటుపై అధికారికంగా ముందడుగు వేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు సమాచారం.
అటు అమెరికాకు, ఇటు తాలిబన్లకు ఆగస్టు 31వ తేదీ అతి కీలకంగా మారింది. ఆరోజు ఏం జరుగుతోందనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు- పంజ్‌షేర్ నేతకు చోటు!