శ్రీలంక అంతర్యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన, జవాబుదారీతనం లోపించ అంశాలపై అంతర్జాతీయ సమాజం విచారణ జరిపే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఈ అంశంలో అంతర్జాతీయ మద్దతును సంపాదించడానికి లంక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చైనా, రష్యా, పాకిస్థాన్ సహా పలు ముస్లిం దేశాల మద్దతు లభిస్తుందని శ్రీలంక భావించింది.
శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని.. అవసరమైతే మానవ హక్కుల ఉల్లంఘనలు, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించిన అన్ని నేరాలపై విచారణ జరిపించాలని ఈ తీర్మానం పేర్కొంది.
ఓటింగ్‌కు దూరంగా భారత్..
ఓటింగ్ ప్రక్రియలో 47సభ్యదేశాలు పాల్గొనగా.. 22 ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. 11దేశాలు వ్యతిరేకంగా వేశాయి. 14 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్ ఒకటి. దీనిని అనవసరమైన, అన్యాయమైన తీర్మానంగా శ్రీలంక అభివర్ణించింది. అంతేగాక ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించినట్లని పేర్కొంది. తీర్మానంపై ఓటింగ్‌కు ముందు.. అధ్యక్షుడు గొటబాయ, ప్రధానమంత్రి మహీంద రాజపక్స వివిధ ముస్లిం దేశాల నాయకులను సంప్రదించారు.
భారత్ వైఖరి స్పష్టం..
శ్రీలంకలోని తమిళులతో సయోధ్యగా ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భారత్ కోరింది. మానవ హక్కులు, పౌరుల స్వేచ్ఛను పరిరక్షించేందుకు అంతర్జాతీయ సమాజంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించింది.
జెనీవాలో నిర్వహించిన 46వ యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశంలో బ్రిటన్, కెనడా, జర్మనీ, మలావి, మాంటెనెగ్రో, నార్త్ మాసిదోనియా దేశాల కోర్ గ్రూప్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి: ఆ విషయంలో భారత్ మద్దతు కోరిన శ్రీలంక