అప్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టలేదు మహిళలు. మంగళవారం మాత్రం ఓ యువతి తన సోదరితో కలసి మార్కెట్‌కు వెళ్లింది. ఇద్దరూ జుట్టు కూడా కన్పించకుండా స్కాఫ్ కప్పుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్లో వీరు తప్ప ఏ ఒక్క మహిళా లేరు. తాలిబన్లు వీరిని చూపులతో భయటపెట్టినప్పటికీ వెంటపడి వేధించలేదు.
అలాగే అందరి అంచనాలకు విరుద్ధంగా అఫ్గాన్‌లో మూడో పెద్ద నగరమైన హెరాత్‌లో బాలికలు బాలురతో కలిసి పాఠశాలకు వెళ్లారు. తాలిబన్లు ప్రతి ఇంటి గడప ముందు వీరి కోసం హిజాబ్‌లు, స్కాఫ్లు ఉంచారు. రాజధాని కాబుల్‌లో ఓ మహిళా న్యూస్ యాంకర్.. తాలిబన్ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేసింది. ఇలాంటి సందర్భం ఒకప్పుడు ఊహించుకోవడానికే కష్టంగా ఉండేది.
అఫ్గాన్‌ను తమవశం చేసుకున్న అనంతరం మహిళ హక్కులకు భంగం కలిగించమని తాలిబన్లు చెప్పారు. వారు యథావిధిగా చదువుకోవచ్చని, తిరిగి విధుల్లో చేరవచ్చని హామీ ఇచ్చారు. అయితే వీరి మాటలపై అక్కడి మహిళలకు ఏ మాత్రం నమ్మకం లేదు. అందుకే అతి కొద్దిమంది మాత్రమే బయటకొచ్చారు.
అయితే అఫ్గాన్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళల్లో దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఒకప్పుడు తమను రాళ్లతో కొట్టి చంపిన రాక్షస తాలిబన్లు మళ్లీ ఇప్పుడు అధికారం చేపట్టాక ఎలాంటి అరాచకాలకు దిగుతారోనని భయపడుతున్నారు. తమ ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
గడప గడపా తిరిగి..
మహిళల స్వేచ్ఛకు అడ్డుపడమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందకు పూర్తి భిన్నంగా ఉన్నాయని కాబుల్‌లోని ఓ మహిళా లెక్చరర్ తెలిపారు. తాలిబన్ల భయంతో పేరు చెప్పడానికి ఆమె నిరాకరించారు. రాజధాని కాబుల్‌లో భయాందోళనకర పరిస్థితి ఉందని చెప్పారు. తాలిబన్లు ప్రతి ఇల్లు తిరిగి తనిఖీలు చేస్తున్నారని వివరించారు. ఒక్కోసారి బలవంతంగా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారని వెల్లడించారు. ప్రజల జోలికి వెళ్లడం లేదని చెబుతున్న తాలిబన్లు మాటల్లో వాస్తవం లేదన్నారు.
జర్నలిస్టులు, తమకు వ్యతిరేకంగా పని చేసేవారు, ఇతరులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ప్రతి ఇంటికీ వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
లూటీ మా పని కాదు..
అఫ్గాన్‌లో జరిగే లూటీలు, దోపిడీలు తమ పేరు చెప్పుకొని వేరే వాళ్లు చేస్తున్నారని తాలిబన్లు చెబుతున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. దేశంలోని అతిపెద్ద జైలులో ఉన్న నేరస్థులను కూడా విడిచిపెట్టారు.
మహిళలు ఎప్పటిలాగే చదువుకుని పనిచేసే వాతావరణాన్ని కల్పిస్తామని, అన్ని ప్రభుత్వ రంగాల్లో వారికి సముచిత స్థానం ఉంటుందని తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు ఎనాముల్లా సమన్గని చెప్పాడు. ఇస్లామిక్ చట్టం ప్రకరం మహిళల హక్కులను గౌరవిస్తామని మరో సభ్యుడు పేర్కొన్నాడు.
అయితే తాలిబన్ల హామీలను నమ్మబోమని కాబుల్‌లోని సీనియర్ మహిళా బ్రాడ్‌కాస్టర్ తెలిపారు. కొద్ది రోజులుగా బంధువుల ఇంట్లోనే రహస్యంగా తలదాచుకుంటున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల లిస్టు పట్టుకుని తాలిబన్లు గడప గడపా తిరుగుతున్నారని తెలిసి భయంతో వణికిపోతున్నట్లు వివరించారు.
తమపై ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతోనే తాలిబన్లు టోలో న్యూస్‌కు చెందిన మహిళా యాంకర్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఇది ఊహకు కూడా అందేది కాదని ఈ ఛానల్ ఓనర్ ట్వీట్ చేశారు.
ప్రతి ఇంటి వద్ద హిజాబ్, స్కాఫ్
ఐదేళ్లుగా ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న మహిళ.. త్వరలోనే మిమానం ద్వారా అఫ్గాన్ నుంచి బయటపడనున్నట్లు తెలిపింది. ఈమెనే తన సోదరితో కలిసి మార్కెట్‌కు వెళ్లింది.
"అక్కడ షాపులన్నీ మూసి ఉన్నాయి. తాలిబన్ల జెండాలు అమ్మే స్టాల్స్ మాత్రమే తెరిచారు. మేమిద్దరం తప్ప బయట ఒక్క మహిళ కూడా కనిపించలేదు. పరీక్షలు ఉన్నందునే పిల్లలు పాఠశాలలకు వెళ్లి ఉంటారు. బాలికల కోసం తాలిబన్లు ప్రతి ఇంటి గడప వద్ద హిజాబ్‌లు, స్కాఫ్లు ఉంచారు' అని మహిళ వివరించింది.
అయితే మహిళలు కచ్చితంగా బుర్ఖాలు ధరించాలని ఇప్పటివరకు ఎవరూ బలవంతం చేయలేదు. గతంలో తాలిబన్ల హయాంలో దుస్తులపై పొడవాటి నీలిరంగు వస్త్రాన్ని మహిళలు ధరించేవారు.
అగమ్యగోచరం..
1996లో తాలిబన్లు అఫ్గాన్‌లో అధికారం చేపట్టినప్పుడు మహిళల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఇస్లామిక్ చట్టం ప్రకారం కఠినమైన ఆంక్షలు విధించేవారు. మగ తోడు లేకుండా ఆడవారిని గడప దాటనిచ్చేవారు కాదు. చదువుకోవడానికి నిరాకరించేవారు. ఇంటి బయట పనికి వెళ్లనిచ్చేవారు కాదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా శిక్షించేవారు. మహిళలు తప్పు చేస్తే బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని అప్గాన్ మహిళలు కలత చెందుతున్నారు.
ఇదీ చూడండి: శాంతి జపంతో మీడియా ముందుకు తాలిబన్లు