మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. మయన్మార్‌కు ఆయుధాల సరఫరాపై.. ఆంక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తీర్మానం చేసిన యూఎన్ జనరల్ అసెంబ్లీ.. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పేర్కొంది.
తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్‌లో.. 193 దేశాలకు గానూ 119 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా బెలారస్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్, చైనా, రష్యా సహా మరో 36 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈయూ, ఆసియాన్ కూటమితో కూడిన కోర్ గ్రూప్.. అనేక చర్చల తర్వాత ఈ తీర్మానాన్ని రూపొందించింది.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ.. ఫిబ్రవరి ఒకటో తేదీన మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సహా.. ఆ పార్టీ కీలక నేతలను మయన్మార్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఏడాది వరకు పాలన తమ నియంత్రణలో ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై మయన్మార్‌లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ప్రపంచ దేశాలు సైతం మయన్మార్ సైన్యం చర్యలను ఖండించాయి.
అందుకే దూరంగా ఉన్నాం: భారత్
ఐరాస జనరల్ అసెంబ్లీ చేసిన ఈ తీర్మానానికి దూరంగా ఉండటం పట్ల భారత్ స్పందించింది. మయన్మార్‌పై తమకు ఉన్న అభిప్రాయాలు ఈ తీర్మానం ముసాయిదాలో ప్రతిబింబించనందునే ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి.. మయన్మార్ పొరుగు దేశాలతో సంప్రదించటం సహా నిర్మాణాత్మక విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పొరుగుదేశాలతో పాటు పలుదేశాల నుంచి మయన్మార్‌కు మద్దతు లభించడం లేదన్న భారత్.. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి.. తాము చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలకు తీర్మానం ఉపయోగపడుతుందని భావించడం లేదని పేర్కొంది.
త్వరగా సమసిపోవాలి..
మయన్మార్‌పై ఆసియాన్ దేశాల చొరవ, ఐదు అంశాల ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు.
"మయన్మార్‌పై భారత్ వైఖరి విస్పష్టంగా, నిర్దిష్టంగా ఉంది. మయన్మార్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై మా ఆందోళనను ఎన్నోసార్లు వ్యక్తపరిచాం. హింసను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. బంగ్లాదేశ్, మయన్మార్‌లతో సుదీర్ఘ సరిహద్దులు గల దేశంగా మయన్మార్ అంశం త్వరగా సమసి పోవాలని కోరుకుంటున్నాం."
-టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత రాయబారి
చట్టాలను అనుసరిస్తూ.. సైన్యం అదుపులోకి తీసుకున్న నేతలను విడుదల చేయాలని కోరుకుంటున్నట్లు తిరుమూర్తి ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి: