చైనాపై లేకిమా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. మరో 20 మంది గల్లంతయ్యారు.
జెజియాంగ్ రాష్ట్రంలోని వెన్జౌ నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో శనివారం 18 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతయింది. జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా షాంఘై డిస్నీల్యాండ్ మూతపడింది. 187 కిలోమీటర్ల మేర వీస్తున్న ప్రచండ గాలులకు వెన్లింగ్ నగరం అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
1000 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు సహా 150 అగ్నిమాపక యంత్రాలు, 153 పడవల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జెజియాంగ్ రాష్ట్రంలో సుమారు 300 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపివేశారు. ఆదివారం సాయంత్రానికి షాండోంగ్ రాష్ట్రంపై లేకిమా ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: త్రుటిలో తప్పిన ప్రమాదం.. లేదంటే అంతే!